Deshpande: జీవితంలో కుదురుకునే లోపే ఉద్యోగాలు ఉఫ్.. 40 ఏళ్ల ఉద్యోగులపై కంపెనీల కాఠిన్యం

by Prasad Jukanti |   ( Updated:2025-04-14 11:56:36.0  )
Deshpande: జీవితంలో కుదురుకునే లోపే ఉద్యోగాలు ఉఫ్..  40 ఏళ్ల  ఉద్యోగులపై కంపెనీల కాఠిన్యం
X

దిశ, డైనమిక్ బ్యూరో: జీవితం అందరికీ ఒకేలా ఉండదు. కొందరు ఏం కష్టం చేయకుండానే విలాసాల మధ్య బతుకుతుంటే.. మరో వైపు విధి వెక్కిరింపులతో కళ్లముందే తమ కలల జీవితం కుప్పకూలే బతుకులు కనిపిస్తుంటాయి. ఎలాగోలో ఈ కష్టాలను ఓర్చి ఉన్నత చదువులు చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకుని కుటుంబం జీవితంతో స్థిరపడాలనుకునే వారికి మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు షాక్ ఇస్తున్నాయి. మీ వయసు 40 ఏళ్లు దాటితే చాలు ఉద్యోగాల నుంచి తొలగించేందుకు ఆయా సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. ఏ వ్యక్తికైనా తాను కలలు కన్న జీవితం సాకారం అయ్యే ఈ దశలోనే అత్యంత దారుణంగా కంపెనీలు ఉద్యోగాల నుంచి ఉద్వాసన పలకడం ఈ ధోరణి ఇప్పుటు ప్రపంచవ్యాప్తంగా నెలకొనడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. కంపెనీలు అనుసరిస్తున్న ఈ ధోరణిపై తాజాగా బాంబే షేవింగ్ (Bombay Shaving Company) కంపనీ సీఈవో శంతన్ దేశ్ పాండే (Shantanu Deshpande) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గోల్డెన్ టైమ్ లో ఇలాంటి పరిస్థితి అత్యంత దారుణం:

తాజాగా శంతన్ దేశ్ పాండే మాట్లాడుతూ 40 ఏళ్ల వయసు వచ్చిన ఉద్యోగులు తమకున్న ఎక్స్ పీరియెన్స్ తో ప్రమోషన్లు పొంది పెద్ద మొత్తంలో శాలరీలు తీసుకుంటుంటారు. దీంతో కాస్ట్ కట్టింగ్ లో భాగంగా ఆయా కంపెనీలు మొదట వీరినే టార్గెట్ చేస్తున్నాయి. కానీ ఎవరికైనా 40 ఏళ్లు లేదా 50 ఏళ్ల ప్రారంభ వయసు లో కెరీర్ పీక్ లో ఉంటుంది. అదే సమయంలో ఆర్థిక సమస్యలు, పిల్లల కాలేజీల ఫీజులు, తల్లిదండ్రుల బాధ్యతలు, వారి ఖర్చులు, హోం లోన్ ఈఎంఐలతో పెద్ద భారం వారి తలలపై ఉంటుంది. అటువంటి సమయంలో ఉన్నటుండి జాబ్ పోతే అది వారికి పైనాన్షియల్ గానే కాదు, ఎమోషనల్ గా కూడా ఆందోళన కలిగిస్తుందన్నారు.

మరి పరిష్కారం ఏంటి?:

కంపెనీలు తమ ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న ఈ ధోరణుల నేపథ్యంలో ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలని లింక్డ్ ఇన్ లో అడిగినప్పుడు శంతన్ మూడు ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఏఐ నైపుణ్యాలను పెంచుకోవాలని మరింత సేవింగ్స్ చేయాలని, ఎంటర్ ప్రైన్యూర్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలని సూచించారు. శంతన్ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళా నెటిజన్ స్పందిస్తూ 42 ఏళ్ల వయసులో తన ఉద్యోగం ఎలా కోల్పోయానో వెల్లడిస్తూ మంచి ప్రొఫైల్ ఉన్నప్పటికీ మంచి ఉద్యోగం సంపాధించుకోవడం చాలా కష్టతరం అవుతున్నదని తన అనుభవాన్ని పంచుకున్నారు. డబ్బు సంపాదించడానికి, కుటుంబం స్థిరపడే సమయంలో సంస్థలు 40 ఏళ్లు దాటగానే వేటు వేయడానికి ప్రయత్నించడం చాలా మందిలో ఒత్తిడికి గురిచేస్తోంది.



Next Story

Most Viewed