ప్రకంపనలు సృష్టిస్తున్న BRS, కాంగ్రెస్ నేతల ఫోన్ సంభాషణ.. కారు పార్టీలో మిగిలేది ఐదుగురేనా?

by Rajesh |
ప్రకంపనలు సృష్టిస్తున్న BRS, కాంగ్రెస్ నేతల ఫోన్ సంభాషణ.. కారు పార్టీలో మిగిలేది ఐదుగురేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో చేరికలపై ఢిల్లీలో రాష్ట్ర, జాతీయ నేతల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంత మంది పార్టీ మారుతారోనని గులాబీ అధిష్టానంలో ఆందోళన నెలకొంది. కేసీఆర్‌కు నమ్మకంగా ఉన్న కేశవరావు, పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్లు ఇప్పటికే పార్టీ మారారు. 6 నెలల్లోనే ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పగా.. ఇంకా నాలుగున్నరేళ్లలో ఎంత మంది పార్టీని వీడుతారేమోనని గులాబీ బాస్ టెన్షన్ పట్టుకుంది. కాంగ్రెస్‌లో చేరికల జోరు పెంచాలని ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక డోర్లు కంప్లీట్‌గా ఓపెన్ చేస్తే వలసల ప్రవాహం ఏ స్థాయిలో ఉంటుందోనని గులాబీ లీడర్లు భయపడుతున్నారు.

కౌన్సిలింగ్ ఇచ్చినా ఫలితం శూన్యం..

ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. త్వరలో మరింత మంది చేరతారని కాంగ్రెస్ లీడర్లు ఓపెన్‌గానే చెబుతున్నారు. అయితే, పార్టీని వీడతారని అనుమానం ఉన్న ఎమ్మెల్యేలను కేసీఆర్ స్వయంగా ఎర్రవల్లి ఫాంహౌజ్‌కు పిలిపించుకుని కౌన్సిలింగ్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఫైనల్‌గా పార్టీలో ఎంత మంది మిగులు తారనే విషయం గులాబీ లీడర్లను పరేషాన్ చేస్తున్నది. కేసీఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన తన సన్నిహితులకు చెందిన ఓ పని కోసం సీఎం రేవంత్‌ కోటరీలోని ఓ కీలక వ్యక్తికి ఇటీవల ఫోన్ చేయగా వారిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

ప్రస్తుత రాజకీయాలపై చర్చ..

చేరికలపై కాంగ్రెస్ ఫోకస్ చేయగా, దాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలపై ఆ రెండు పార్టీల నేతల మధ్య ఫోన్ సంభాషణలో చర్చ జరిగింది. అటు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ అప్ చేయగా.. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై బీఆర్ఎస్ పార్టీ ఎత్తుల గురించి వీరి మధ్య డిస్కషన్ జరిగింది. ప్రస్తుతం ఆ చర్చకు సంబంధించి విషయాలు బయటకు లీకయ్యాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీలో మున్ముందు చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారతారని బహిర్గతమైంది. చివరకు గులాబీ పార్టీలో కేవలం 5 గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని, ఆ విధంగా కాంగ్రెస్ భారీ స్కెచ్ వేసిందని టాక్. నేతల మధ్య సంభాషణ ఎలా జరిగిందంటే..

గులాబీ లీడర్: అన్నా నమస్తే..బాగున్నారా? ఎక్కడున్నారు?

కాంగ్రెస్ లీడర్: నమస్తే భయ్యా. బాగున్నా. హైదరాబాద్‌లోనే ఉన్నా.

గులాబీ లీడర్ : ఢిల్లీ నుంచి వచ్చేశారా?

కాంగ్రెస్ లీడర్ : పొద్దునే వచ్చాను. అయినా, నీవు నాకు కాల్ చేయడం ఏంటో? నువ్వు పెద్ద లీడర్‌వి? స్వయంగా నువ్వే ఫోన్ చేస్తున్నావంటే మీ బాస్ (కేసీఆర్) చేసినట్టే అనుకోవాలేమో.

గులాబీ లీడర్ : అన్నా..నేను పెద్ద లీడర్‌ని ఎట్లయిత? నన్ను ఓడగొట్టేందుకు మీ సారు (సీఎం రేవంత్ రెడ్డి) బీజేపీ నుంచి ఓ లీడర్‌ను తీసుకొచ్చి మరీ నిలబెట్టి ఓడిస్తడా? ఇప్పుడు ఖాళీగా ఉన్నా అన్నా. ఢిల్లీలో ఏం జరుగుతోందన్నా? ఎవరెవరిని మంత్రుల్ని చేస్తున్నారు?

కాంగ్రెస్ లీడర్ : ఇప్పుడేం మంత్రివర్గ విస్తరణ ఉండదు. మీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంపైనే డిస్కషన్ నడుస్తున్నది.

గులాబీ లీడర్: అవునా? అక్కడ (ఢిల్లీలో) ఎంతమంది ఉన్నారన్నా?

కాంగ్రెస్ లీడర్: పేర్లు చెప్పమంటావా? చెబితే పరేషాన్ అయితవ్..వద్దులే.

గులాబీ లీడర్ : పర్లేదు..చెప్పు అన్నా.

కాంగ్రెస్ లీడర్ : ఇప్పుడొద్దులే..త్వరలో నువ్వే చూస్తవు గదా! చేరికలు ఓపెన్‌గానే జరుగుతున్నాయి.

గులాబీ లీడర్ : ఎంత మందిని చేర్చుకుంటారన్నా?

కాంగ్రెస్ లీడర్ : చాలా మంది ఉన్నారు భయ్యా..ఇప్పటికే చేరిన వాళ్ల గురించి మీకు తెలుసు. త్వరలో మరో 13 మంది రెడీగా ఉన్నారు. ఆ తర్వాత మిగతా ఎమ్మెల్యేలు కూడా వస్తారు.

గులాబీ లీడర్ : వామ్మో..అంత మంది వస్తున్నారా? మా పార్టీని మొత్తం ఖాళీ చేసేస్తారా?

కాంగ్రెస్ లీడర్ : మొత్తం ఖాళీ కాదులే గానీ.. మీ దగ్గర ఐదుగురు ఎమ్మెల్యేలు మిగులుతారులే. ఇంకా ఎక్కువనుకుంటే ఓ ఆరుగురు ఉంటారు. పార్టీలో ఉండే ఎమ్మెల్యేల పేర్లు చెప్పమంటావా?

గులాబీ లీడర్: వద్దులే అన్నా..ఆ ఐదుగురు ఎవరో నాకు కూడా తెలుసు.

కాంగ్రెస్ లీడర్: భాయ్! నువ్వంటే మా బాస్ (సీఎం రేవంత్)కు మంచి అభిప్రాయమే ఉంది. మా బాస్ మీద ఎన్ని విమర్శలు చేసినా ఆయన అవేమి పట్టించుకోలేదు. ఎందుకంటే నీలాంటి వాళ్లతోనే గదా మీసారు (కేసీఆర్) తిట్టిస్తున్నది. సరే కానీ ఏదో పని మీద ఫోన్ చేసినట్లున్నవ్?

గులాబీ లీడర్ : అవునన్నా..మా సన్నిహితులకు ఓ పని ఉంది. ఆ పని జర చేసిపెట్టు అన్నా.

కాంగ్రెస్ లీడర్ : ఓకే. రేపు పార్టీ ఆఫీసులోనే ఉంటా. మీ వాళ్లను అక్కడికి పంపు. తప్పకుండా హెల్ప్ చేస్తా.



Next Story