బిగ్ న్యూస్: T- బీజేపీ కొంపముంచుతోన్న ‘‘చిట్‌ చాట్స్’’.. రాష్ట్ర నేతలపై హైకమాండ్ సీరియస్!

by Satheesh |   ( Updated:2023-05-30 00:30:50.0  )
బిగ్ న్యూస్: T- బీజేపీ కొంపముంచుతోన్న ‘‘చిట్‌ చాట్స్’’.. రాష్ట్ర నేతలపై హైకమాండ్ సీరియస్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయాలని చూస్తున్న బీజేపీకి సొంత పార్టీ నేతల కామెంట్లే వివాదాస్పదంగా మారుతున్నాయా? బీజేపీలో పలువురు నేతలు చిట్ చాట్ పేరిట చేస్తున్న కామెంట్లతో పార్టీ భారీ నష్టాన్ని మూటగట్టుకుంటోందా? బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే అనేంతగా ఎదిగిన పార్టీకి పలువురు నేతల వ్యాఖ్యలు మైనస్‌గా మారుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

తెలంగాణలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని పార్టీలు దీనికి సిద్ధమవుతుండగా బీజేపీ నేతలు మాత్రం మీడియా చిట్ చాట్ పేరిట వివాదాస్పద కామెంట్లతో రోజురోజుకూ డౌన్ ఫాల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కష్టంగా మారే అవకాశాలున్న నేపథ్యంలో హైకమాండ్ దీనిని సీరియస్‌గా పరిగణిస్తోంది.

కర్ణాటక ఎన్నికల తర్వాత టీ-బీజేపీలో మీడియా చిట్ చాట్ పేరిట పలువురు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏకతాటిపైకి వచ్చి అధికార పార్టీని ఢీకొట్టాల్సింది పోయి సెల్ఫ్ గోల్ వేసుకుంటూ చతికిలపడుతోంది. కాగా, టీబీజేపీ నేతల తీరుపై దృష్టిసారించిన జాతీయ నాయకత్వం చిట్ చాట్ నిర్వహించి పార్టీకి డ్యామేజ్ అయ్యేలా వ్యాఖ్యలు చేయడంపై సీరియస్‌గా ఉంది.

ఇటీవల పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలతో జాతీయ నాయకత్వం అలర్ట్ అయింది. చిట్ చాట్ పేరిట తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్లపై ఆరా తీస్తోంది. రాష్ట్ర నాయకత్వానికి ఏమాత్రం తెలియకుండానే పూర్తి ఆధారాలతో వివరాల సేకరణను చేపడుతోంది. అసలు చిట్ చాట్‌లో ఇలాంటి కామెంట్లు ఎందుకు చేయాల్సి వచ్చిందనే అంశాలపై బీజేపీ జాతీయ పార్టీ పెద్దలు కూపీ లాగుతున్నారు.

ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పలువురు బీజేపీ నేతలు పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేశారు. ఇవి పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చేలా ఉండటంతో శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే ఉన్న సమయంలో చేస్తున్న వ్యాఖ్యలపై హైకమాండ్ గుర్రుగా ఉంది. నేతలు ఎక్కడ ఎవరితో ఏం కామెంట్లు చేస్తున్నారనే విషయాలను పూర్తి ఆధారాలతో తెలుసుకుంటున్నట్లు సమాచారం.

ఆయా చానళ్లకు సంబంధించిన యూట్యూబ్ లింకులు, పేపర్ క్లిప్పింగులు సైతం హైకమాండ్‌కు చేరుతున్నట్లు తెలుస్తోంది. అయితే పలువురు నేతల చిట్ చాట్ కారణంగా బీజేపీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతోంది. దీంతో దీనిపై చర్యలు తీసుకోకుంటే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జాతీయ పెద్దలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఇకపై ఇలాంటి మీడియా చిట్ చాట్‌లకు స్వస్తి చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. నేతలెవరైనా పార్టీ లైన్ దాటి, పార్టీకి డ్యామేజ్ కలిగేలా వ్యవహరిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. మరి పలువురు టీబీజేపీ నేతలు ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకుంటారా? లేదా అనేది చూడాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed