'పేషెంట్స్‌‌తో ప్రేమగా మాట్లాడితేనే వ్యాధి సగం తగ్గుతుంది'.. కొత్త డాక్టర్లకు మంత్రి హరీష్ సూచన

by Vinod kumar |
పేషెంట్స్‌‌తో ప్రేమగా మాట్లాడితేనే వ్యాధి సగం తగ్గుతుంది.. కొత్త డాక్టర్లకు మంత్రి హరీష్ సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘వైద్య విద్యార్థుల పై ప్రభుత్వం కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్నది. దానిని వైద్య సేవల ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వండి. ప్రాణం పోసేది అమ్మ అయితే, ఆనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారికి వైద్యం అందించి పునర్‌ జన్మ ఇచ్చేది ఒక్క వైద్యుడు మాత్రమే. ఆ వృత్తికి మరింత గౌరవాన్ని పెంచాలని కోరుతున్నాను. ‘మెడిసిన్స్‌ క్యూర్‌ డిసీజెస్‌.. బట్‌ ఓన్లీ డాక్టర్స్‌ కెన్‌ క్యూర్‌ పేషెంట్స్‌’ రోగులతో ప్రేమగా మాట్లాడితే వ్యాధి సగం తగ్గుతుంది. మందులు రోగాన్ని నయం చేస్తే, వైద్యులు మాత్రమే రోగిని పూర్తి ఆరోగ్య వంతున్ని చేస్తారు. ఎన్ని మందులు ఇచ్చాము అనేదానికంటే, మీరు ప్రేమగా మాట్లాడే మాట, ఇచ్చే ధైర్యం సగం రోగాన్ని తగ్గిస్తుంది. మానసికంగా రోగికి ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది.”అంటూ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు పేర్కొన్నారు.


సోమవారం శిల్పకళ వేదికలో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులుగా చేరుతున్న అందరికీ అభినందనలు తెలిపారు. టీచింగ్ ఆసుపత్రుల్లో సేవలు అందించేందు 34 స్పెషాలిటీల్లో 1,061 మందికి ఒకేసారి పోస్టింగ్ లు ఇస్తున్నామన్నారు.ఇది దేశంలో వైద్య విద్యలో రికార్డ్ అని,సీఎం కేసీఆర్ వల్లే ఇది సాధ్యం అయిందన్నారు. కేవలం 5 నెలల్లోనే అత్యంత పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తి చేసి, అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇచ్చేందుకు కృషి చేసిన హెల్త్ డిపార్ట్​మెంట్ ను అభినందించారు.

గతంలో 969 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నియామక పత్రాలు ఇవ్వగా, అతిత్వరలో 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరలో ఆన్ లైన్ లో (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) నిర్వహించుకోబోతున్నామన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ వైద్య శాఖలోని ఏడు విభాగాల్లో1331 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేశారన్నారు. ఇందులో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్, ఆయుష్ విభాగానికి చెందిన డాక్టర్లు ఉన్నట్లు మంత్రి మరోసారి గుర్తు చేశారు.గడిచిన 9 ఏళ్లలో ఒక్క వైద్యారోగ్య శాఖలోనే 22,263 పోస్టులు భర్తీ చేసుకోగా, మరో 9,222 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదన్నారు. రెండు,మూడు నెలల్లో ఇది పూర్తవుతుందన్నారు. స్వ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 31,484 పోస్టుల నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. కమిట్​మెంట్​ కలిగిన సీఎం చొరవతోనే ఇది సాధ్యమవుతుందన్నారు.

Advertisement

Next Story