TG Govt.: రాష్ట్రంలో కొలువుల జాతర.. 2 వేల పోస్టులకు నోటిఫికేషన్!

by Shiva |
TG Govt.: రాష్ట్రంలో కొలువుల జాతర.. 2 వేల పోస్టులకు నోటిఫికేషన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మళ్లీ ఉద్యోగాల జాతర మొదలు కానున్నది. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై గవర్నర్ సంతకం చేసిన వెంటనే కొత్తగా పోస్టులు ఫిలప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మొదటగా 2 వేల గెజిటెడ్ ఉద్యోగాల భర్తీ, తర్వాత 5 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తు్న్నట్టు తెలుస్తున్నది. వీటితో పాటు ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం మిగతా డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్రంలోని రేవంత్ సర్కారు ప్లాన్ చేస్తున్నది.

గతేడాది ఆగస్టులోనే జాబ్ క్యాలెండర్ ప్రకటన

గతేడాది ఆగస్టులోనే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించింది. ఏయే ఉద్యోగాలు ఫిలప్ చేయనున్నారు.. ఏ నెలలో నోటిఫికేషన్ వస్తుంది.. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాలన్నీ అందులో స్పష్టంగా పేర్కొన్నది. కానీ ఆ లోపే ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేయడంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది.

రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాకే..

ఎస్సీ కులాల్లోని ఆర్థిక, సామాజిక పరిస్థితుల మేరకు ఆయా కులాలకు రిజర్వేషన్లు ఫైనల్ చేసిన తర్వాతే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఆలస్యం చేయకుండా జ్యూడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఇచ్చిన సిఫార్సుల మేరకు వర్గీకరణ ప్రాసెస్ కంప్లీట్ చేసి దానిని అసెంబ్లీలో పెట్టి ఆమోదం తీసుకున్నది. ఆ బిల్లు గవర్నర్ సంతకం కోసం రాజ్ భవన్‌కు పంపారు. రెండు, మూడు రోజుల్లో గవర్నర్ ఆమోదించి ప్రభుత్వానికి పంపనున్నట్లు సమాచారం.

ముందుగా ఆ పోస్టులు భర్తీ

ప్రస్తుతం రెండు వేల గెజిటెడ్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే ఏయే శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో గుర్తించి వాటిని భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ సైతం ఇచ్చింది. వర్గీకరణ ప్రకారం రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ అయిన వెంటనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నది.

5 వేల పోస్టులతో డీఎస్సీ

గెజిటెడ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ వేసి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ సంవత్సరం సుమారు ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉంటాయని ప్రభుత్వ వర్గాల అంచనా. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం ఫిబ్రవరి 5న రిజల్ట్స్ విడుదల చేసింది.

రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేసే పనిలో అధికారులు

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదించిన వెంటనే మూడు గ్రూపులకు రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేయాలి. ఏ గ్రూపుకు ఏ రోస్టర్ పాయింట్స్ రిజర్వేషన్ ఇవ్వాలనేది ఇప్పటికే కమిషన్ సిఫార్సు చేసింది. ఆ మేరకు కొత్తగా ప్రకటించే నోటిఫికేషన్లలో ఎస్సీ కేటగిరిల్లోని మూడు గ్రూపులకు విడివిడిగా రిజర్వేషన్ల ప్రకారం లభించే పోస్టుల సంఖ్య పేర్కొనాలి. అందుకోసం ఇప్పటికే ప్రభుత్వంలోని జీఏడీ(జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) విభాగం కసరత్తు షురూ చేసినట్టు తెలుస్తు్న్నది.

Next Story

Most Viewed