- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TG Govt.: కులగణన రీసర్వేకు నో రెస్పాన్స్.. ఎంట్రీ ఇవ్వని ఆ ఫ్యామిలీ

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి కులగణన రీ సర్వేకు ప్రజా స్పందన కరువైంది. ఈ నెల 16 నుంచి నెలాఖరు వరకూ రీ సర్వేకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలో 3,56,323 కుటుంబాలు సర్వేకు నోచుకోనట్టు గుర్తించింది. చాలా ఇళ్లకు తాళం వేసి ఉండటం, మరికొందరు ఆసక్తి చూపకపోవడంతో సర్వేకు నోచుకోని ఆయా కుటుంబాలకు మరో అవకాశం కల్పించింది. అందుకోసం మూడంచెల విధానాన్ని తెరమీదకు తెచ్చింది. టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి .. ఎన్యూమరేటర్లను పిలిపించుకునే చాన్స్ కల్పించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని వివరాల నమోదుకు వీలు కల్పించింది. నేరుగా మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి వివరాలు అందజేసే అవకాశాన్ని కల్పించింది. అయినప్పటికీ చాలామంది సర్వేపై ఆసక్తి చూపడం లేదు.
అయితే..మాకేంటి?
కులగణనపై ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసినా.. బీసీ గణనకు సైతం ప్రజలు ఆసక్తి చూపడం లేదు. రీ సర్వేకు అంతంత మాత్రమే స్పందన రావడంతో లక్ష్యం నెరవేరేనా? అన్న సందేహం అధికారుల్లో నెలకొంది. కులగణన దేనికో తెలియక చాలామంది హైదరాబాదీలు ..బిక్కముఖం వేస్తున్నారు. బీసీ కమిషన్ సభ్యులు పలు ఏరియాలలో పర్యటించారు. కులగణన సర్వేపై ఆరా తీశారు. అందరూ కుల సర్వేలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అయినా చాలామంది స్పందించలేదు. కులగణనలో పాల్గొంటే.. మాకేంటి లాభమని మరికొందరు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఇంకొందరు తమ కుటుంబ వివరాలు ఇస్తే ఎలాంటి సమస్య ఎదుర్కొంటామోనని భయపడుతున్నారు.
అరకొరగానే ఆసక్తి
క్యాస్ట్‌సెన్సస్‌కు నోచుకోని కుటుంబాలు రాష్ట్రవ్యాప్తంగా 3,56,323 ఉంటే.. కొన్ని కుటుంబాలు మాత్రమే వివరాలు చెప్పడానికి ఆసక్తి చూపాయి. రీ సర్వేకు కేటాయించిన టోల్ ఫ్రీ నంబర్‌కు 6,415 కాల్స్ వచ్చినట్టు అధికారులు అంచనా వేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్యామిలీతో సహా పలువురు ప్రముఖులు ఇప్పటికీ తమ వివరాలను బహిర్గతం చేయలేదు. ప్రముఖులే వివరాలు చెప్పనప్పుడు.. తామెందుకు చెప్పాలని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. రీసర్వేకు గడువు మరో నాలుగు రోజులే ఉన్నప్పటికీ.. చాలా కుటుంబాలు తమ వివరాలు నమోదు చేసుకుంటాయో? లేదో? అన్నది సందేహాస్పదమే!