- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG Govt.: లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. కొత్త రేషన్ కార్డులపై సర్కార్ కీలక నిర్ణయం

దిశ, తెలంగాణ బ్యూరో: ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి సమాయిత్తమవుతున్న తెలంగాణ సర్కార్..మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీ సేవా కేంద్రాల ద్వారా స్వీకరించిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణకు ఏర్పాట్లు చేస్తోంది. విచారణ బాధ్యతలను పౌరసరఫరాల శాఖకు అప్పగించింది. సివిల్ సప్లై అధికారులు ఇంటింటికీ వెళ్లి...దరఖాస్తుదారులను విచారిస్తారు. గత పదేళ్ల నుంచి రాష్ట్రంలో 89. 90 లక్షల కార్డుల ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం సరుకులు అందజేస్తోంది. మరికొందరు నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు అందించడానికి ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామసభల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఇంకొందరికి మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
వివరాల సేకరణకు ఏర్పాట్లు
అర్హులను గుర్తించేందుకు అధికారులు ఇంటింట పర్యటనకు సిద్ధమవుతున్నారు. దరఖాస్తుదారుల స్థితిగతులపై ఆరా తీస్తారు. ఇంట్లో ఉండే ఖరీదైన వస్తువులు, కారు, బైక్, విద్యుత్ బిల్లులు తదితర వివరాలను నమోదు చేస్తారు. ఇంటి యాజమాని ఫోన్ నంబర్, కుటుంబ సభ్యుల పేర్లు, నెలవారీ ఆదాయ వివరాలను కూడా సేకరిస్తారు. దరఖాస్తుదారు అందుబాటులో లేకుంటే ఫోన్ ద్వారా వివరాలు సేకరిస్తారు.
మీసేవా ద్వారా 2.50 లక్షల దరఖాస్తులు
మీ సేవా ద్వారా రాష్ట్రంలో 2.50 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఒక్క గ్రేటర్హైదరాబాద్లోనే 1.35 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్టు అంచనా. దరఖాస్తు విచారణ ప్రక్రియను పౌరసరఫరాల శాఖకు చెందిన ఆర్ఐలు, ఇతర అధికారులు పర్యవేక్షిస్తారు. కుటుంబ సభ్యుల మార్పులు-చేర్పుల కోసం 20 లక్షలకుపైగా దరఖాస్తులు రావడంతో వాటిని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం.
పేదల్లో చిగురిస్తున్న ఆశలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన కార్డులు ముద్రించి పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. నీలిరంగులో కార్డులు వస్తాయనే ప్రచారం ఊపందుకోవడంతో చాలామంది నిరుపేదలు సంబరపడుతున్నారు. కార్డొస్తే తమ కష్టాలన్నీ తీరుతాయని భావిస్తున్నారు. కార్డు ఉంటే ...ఆరోగ్యశ్రీ, కుల, ఆదాయ ధ్రువ పత్రాలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్వంటి పథకాలు అందుతాయని ఆశిస్తున్నారు. ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయితే రేషన్ కార్డు అందడం ఖాయమని ఆశావాహులంతా భావిస్తున్నారు.