- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG Budget: బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట.. ఆ రెండింటిపై సర్కార్ ఫోకస్

దిశ, తెలంగాణ బ్యూరో: బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. రైతు భరోసా కోసం ఏకంగా రూ.18 వేల కోట్లను కేటాయించారు. రైతు బీమా, సన్నాలకు సబ్సిడీ కోసం ప్రత్యేకంగా నిధులు ఇచ్చారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఆ శాఖకు అత్యధికంగా ఫండ్స్ అలాట్ చేశారు. గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు ఆ నిధులను ఖర్చు చేయనున్నారు. విద్యుత్ శాఖకూ ఎక్కువ నిధులు ఇచ్చారు. ఆ శాఖ అమలు చేస్తున్న గృహజ్యోతి, ఉచిత విద్యుత్ కోసం ఫండ్స్ ఖర్చు చేయనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అమలు కోసం హౌసింగ్ శాఖకు ప్రత్యేకంగా నిధులు సమకూర్చనున్నారు.
రైతుల సంక్షేమంపై దృష్టి
రైతాంగం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం రైతుల కోసం ఏకంగా రూ.32,889 కోట్లు కేటాయించారు. అందులో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు, ఉచిత విద్యుత్ సబ్సిడీకి రూ.11,500 కోట్లు సమకూర్చనున్నారు. సన్న బియ్యం సాగు చేసే రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చేందుకు రూ. 1,800 కోట్లు అలాట్ చేశారు. రైతు భీమా కోసం రూ. 1,589 కోట్లు కేటాయించారు.
స్థానిక సంస్థలకు ప్రయారిటీ
పంచాయతీ, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఆ రెండు శాఖలకు అధిక నిధులు కేటాయించారు. పంచాయతీరాజ్ శాఖకు రూ.31,605 కోట్లు, మున్సిపల్ శాఖకు రూ.17,677 కోట్లు అలాట్ చేశారు. వేసవి కాలం ముగిసిన వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని సర్కారు భావిస్తున్నది. ఈలోపు స్థానిక సంస్థల అభివృద్ధి కోసం కావాల్సిన నిధులను ఖర్చు చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చేందుకు ఆ శాఖకు రూ.14,154 కోట్లు కేటాయించారు. లోకల్ బాడీ ఎన్నికల లోపు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ద్వారా లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించునున్నారు.