చంద్రబాబు వ్యాఖ్యలను సమర్ధించిన కాసాని.. నిరంజన్‌ రెడ్డికి సవాల్

by GSrikanth |
చంద్రబాబు వ్యాఖ్యలను సమర్ధించిన కాసాని.. నిరంజన్‌ రెడ్డికి సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్టీఆర్ రూ.2 కిలో బియ్యం ఇచ్చిన తర్వాతే ప్రతి పేదవాడికి కడుపునిండా తినే అవకాశం దొరికిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. బియ్యంపై చంద్రబాబు మాట్లాడిన మాటలను వక్రీకరించొద్దని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దొడ్డు నాడు ధమ్ కా బిర్యానీ ఎక్కడ దొరికిందో నిరంజన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ లో దొరికిందా? అని ప్రశ్నించారు. నిరంజన్ రెడ్డి స్క్రిప్టు చదవడం మానుకుని వాస్తవం తెలుసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధిని ఇంటింటికీ టీడీపీలో భాగంగా బ్రోచర్ ను పంపిణీ చేస్తున్నామన్నారు. తెలంగాణలో టీడీపీ బలపడితే పుట్టగతులు ఉండవనే భయంతోనే బీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

పెత్తందారి పోతది.. గడీలపాలన పోతదనే భయం పట్టుందని.. ఒక్క రోజూ టీడీపీ మీటింగ్ పెడితే భయమెందుకని ప్రశ్నించారు. టీడీపీ మళ్లీ వస్తుంది.. గడీల పాలనపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలే అంతిమ నిర్ణేతలని పేర్కొన్నారు. చేసిన పనిని టీడీపీ చెబుతుందని, చేయని పనిని బీఆర్ఎస్ చెప్పుకుంటుందని మండిపడ్డారు. అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని, ఎక్కడికి రమ్మంటే అక్కడి వస్తానని సవాల్ చేశారు. కాళేశ్వరంతో ఒక్క చెరువు నిండలేదని ఆరోపించారు. ‘స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది ఎన్టీఆర్’ అని గతంలో ఉమ్మడి ఏపీలో కేసీఆర్ మాట్లాడిన వీడియోలను మీడియాకు రిలీజ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న, మీడియా వ్యవహారాల కో ఆర్డినేటర్ బియ్యని సురేశ్, ఆజ్మీరా రాజునాయక్, సుబ్బారావు, ఆరీఫ్, అనూప్ పాల్గొన్నారు.

Advertisement

Next Story