Maha Shivratri Effect: భక్తులకు గుడ్ న్యూస్.. వారికి దేవాదాయ శాఖ హెచ్చరిక

by Gantepaka Srikanth |
Maha Shivratri Effect: భక్తులకు గుడ్ న్యూస్.. వారికి దేవాదాయ శాఖ హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహా శివరాత్రి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని శైవ క్షేత్రాల్లో ఈసారి దేవాదాయ శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అసౌకర్యం కలగకుండా ఉండేలా పటిష్టమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు మహా శివరాత్రి పర్వదిన వేడుకలు జరగనున్నాయి. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, కీసర రామలింగేశ్వర స్వామి, ఏడుపాయ‌ల వ‌న దుర్గ భ‌వానీ అమ్మవారు, రామ‌ప్ప, మేళ్లచెరువు స్వయంభూ శంభులింగేశ్వరస్వామి దేవ‌స్థానం, చాయా సోమేశ్వర ఆలయం పాన‌గ‌ళ్లు, సోమేశ్వర దేవ‌స్థానం పాల‌కుర్తి, వెయ్యి స్థంభాల గుడి, మెట్టుగుట్ట దేవాలయం, కాశీబుగ్గ ఆల‌యం, భద్రకాళి, తదితర దేవస్థానాల్లో అవసరమైన ఏర్పాట్లపై చర్యలు తీసుకోనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులకు పలు సూచనలు చేశారు.

పండ్లు, అల్పాహారం ఉచితంగా పంపిణీ..

శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉపవాసం ఉండే భ‌క్తుల‌కు పండ్లు, అల్పాహారం ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రతి ఆలయం దగ్గర ఎంట్రీ పాయింటులు, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. ఆలయాల సమీపంలో లిక్కర్ అమ్మకాలు చేయొద్దని, విక్రయిస్తే కఠిన చ‌ర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

ప్రత్యేకంగా కంట్రోల్ రూం..

దేవాలయాలున్న పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో భ‌ద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు, పారిశుధ్య చ‌ర్యలు, మెడిక‌ల్ క్యాంపులు ఏర్పాటు చేయాల‌ని, భ‌క్తుల తాకిడి ఎక్కువ‌గా ఉండే చోట అంబులెన్స్ లు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. హైద‌రాబాద్ ఎండోమెంట్ క‌మిష‌న‌రేట్‌ ఆఫీసులో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నారు. గోదావ‌రి, కృష్ణా ఇతర న‌ది ప‌రివాహ‌క ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో న‌దీహార‌తికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయనున్నారు.

ఆర్టీసీ ప్రత్యేకంగా 500 బస్సులు..

మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వేములవాడ, కాళేశ్వరం, కీసర రామలింగేశ్వర స్వామి, ఏడుపాయ‌ల వ‌న దుర్గ భ‌వానీ, సోమేశ్వర దేవ‌స్థానాలకు ప్రత్యేకంగా 500 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం నగరంలోని జేబీఎస్, ఎంజీబీస్తోపాటు వివిధ ప్రాంతాల నుంచి ఈ బస్సులను నడపనున్నామని వారు పేర్కొన్నారు.



Next Story