కాంగ్రెస్‌కు ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదు.. తమిళనాడు బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై

by Disha Web Desk 4 |
కాంగ్రెస్‌కు ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదు.. తమిళనాడు బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై
X

దిశ, సంగారెడ్డి : దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం ఓటింగ్ పూర్తియిన నేటికి కూడా ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి తెలియడం లేదని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సెటైర్లు వేశారు. మంగళవారం బీజేపీ మెదక్ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలని కోరుతూ సంగారెడ్డి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా కార్యకర్తల నుద్దేశించి అన్నామలై మాట్లాడారు. దేశంలో సుస్థిర పాలన కావాలంటే మోడీ ప్రధానమంత్రి కావాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లీం మహిళలు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు త్రిపుల్ తలాక్ రద్దు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా దేశమంతా ఒకేలా ఉండాలని 370 ఆర్టికల్ రద్దు చేసి ప్రజా పాలనను తీసుకువచ్చామని వివరించారు.

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశం సుస్థిరంగా ఉండాలన్నా, అభివృద్ధి జరగాలన్నా బీజేపీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిని కూడా ప్రకటించలేని పరిస్థితిలో ఉందని వారు అధికారంలోకి వస్తే త్రిపుల్ తలాక్. ఆర్టికల్ 370 రద్దు చేస్తారన్నారు. బీజేపీ నుంచి కేవలం ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. రాహుల్ గాందీ ప్రధానిని ప్రకటించలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఇండియా కూటమిలోని పార్టీలు అవినీతి పార్టీలను విమర్శించారు. అదే బీజేపీ గత 10 సంవత్సరాల్లో దేశాన్ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లు కేవలం దేశం కోసం మాత్రమే జరుగుతున్నాయని, దేశం సుస్థితర కోసం బీజేపీని గెలిపించాలని కోరారు.

రాష్ట్రంలో హామీలు మరిచిన కాంగ్రెస్ ..

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకటి మాత్రమే అమలు చేశారని మిగిలిన ఐదు గ్యారెంటీలు అమలు చేయలేదని విమర్శించారు. మహిళలకు ఇస్తామన్నా రూ.2500, గ్యాస్ సిలిండర్ రూ.500లు, రైతు భరోసా రూ.15000, రైతు కూలీలకు రూ.12వేలు అమలు చేయలేదన్నారు. అదే విధంగా వృద్ధులకు ఇస్తామన్నా ఫించన్ రూ.4వేలు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. విద్యను అభ్యసించేందుకు ఇస్తామన్నా రూ.5లక్షలు ఇవ్వలేదని విమర్శించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించాలని, నరేంద్రమోడీ ఆద్వర్యంలో దేశం శాంతి బద్రతల సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉందన్నారు.

దేశం మరింత అభివృద్ధి, సుస్థితరకు బీజేపీని గెలిపించాలని 399ప్లస్ మెదక్ కలిపి 400 సీట్లు బీజేపీ వస్తాయన్నారు. అదే విధంగా కాంగ్రెస్ వస్తే రామమందిరాన్ని తొలగిస్తారా, త్రిపుల్ తలాక్ రద్దు చేస్తారా, ఆర్టికల్ 370 రద్దు చేస్తారా అంటూ సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో రాజ్యాంగాన్ని బీజేపీ కాపాడుతుందని, దేశంలో ముస్లీం అబ్దుల్ ఖలాంను, ఎస్సీ అయిన రామ్ నాథ్ కోవిండ్, గిరిజన ద్రౌపది ముర్ములను రాష్ట్రపతిలను చేసిన ఘనత బీజేపీదే అన్నారు. ఈ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా రఘునందన్ రావును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, కొండాపురం జగన్, కసిని వాసు, నాగరాజు, ద్వారకారవి, డా.రాజుగౌడ్, రమేష్, రాములు, విష్ణువర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed