సమ్మర్ ఎఫెక్ట్.. ఊహించని రేంజ్‌లో పెరిగిన విద్యుత్ వినియోగం

by Disha Web Desk 9 |
సమ్మర్ ఎఫెక్ట్.. ఊహించని రేంజ్‌లో పెరిగిన విద్యుత్ వినియోగం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైందని, గతేడాది మే నెల కంటే ప్రస్తుతం 56 శాతం వాడకం పెరిగిందని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లతో శనివారం ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వేసవి సీజన్ లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడం వల్ల విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరిగిందన్నారు. ఈ తరుణంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రతి విద్యుత్ శాఖ ఉద్యోగి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ సీజన్లో ఇప్పటికే ఏప్రిల్ 30వ తేదీన 4,214 మెగావాట్ల అత్యధిక డిమాండ్ నమోదైందన్నారు. శుక్రవారం 89.71 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైందన్నారు. గతేడాది మే 3న 58.34 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదుతో పోల్చుకుంటే ఇది 53.7 % అధికమని తెలిపారు. కాగా శనివారం 4209 మెగావాట్ల డిమాండ్ నమోదైనట్లు సీఎండీ వెల్లడించారు. ఈ సీజన్ లో మే నెల ముగిసేవరకు డిమాండ్ మరింతగా పెరిగే అవకాశముందని ముషారఫ్ ఫరూఖీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ సీజన్ ముగిసే వరకు ప్రతి 11 కేవీ ఫీడర్ కు ఇంచారర్జీగా ఒక ఇంజినీర్ ను షిఫ్టులవారీగా నియమించాలని ఆదేశించారు. దీనికి సంబంధించి సంస్థ ప్రధాన కార్యాలయంలో, ఇతర సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో పని చేస్తున్న దాదాపు 300 ఇంజినీర్లను సైతం ఆపరేషన్ విధుల్లో నియమించారు. దీనికి తోడు సర్కిల్ కార్యాలయాల్లో పని చేసే అకౌంటింగ్ సిబ్బందికి సైతం ఆపరేషన్ విధులు అప్పగించాల్సిందిగా సీఎండీ ఫరూఖీ ఆదేశించారు.

వేసవి డిమాండ్ల నేపథ్యంలో ఇప్పటికే 4353 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు అదనంగా ఏర్పాటు చేసినట్లు ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. వీటికి అదనంగా మరో 250 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లను క్షేత్ర స్థాయి కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అవసరమైన చోట విద్యుత్ సిబ్బంది వాటిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసి వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఇన్ చార్జీ డైరెక్టర్లు కే రాములు, ఎన్ నర్సింహులు, నంద కుమార్, శ్రీసుధా మాధురి, చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story