- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీహార్ జైలు నుంచి సుఖేశ్ సంచలన లేఖ.. బీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఇదే!
లిక్కర్ స్కాంలో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆమ్ ఆద్మీ, బీఆర్ఎస్ పార్టీలపై సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేస్తూ బాంబు పేల్చారు. ఆ రెండు పార్టీల మధ్య రూ.75 కోట్ల డీల్ కుదిరిందని, అందులో భాగంగా కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచనలతోనే తాను హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో రేంజ్ రోవర్ కారులో ఉన్న ‘ఏపీ’ అనే వ్యక్తికి 2020లోనే రూ.15 కోట్లు ఇచ్చానంటూ సంచలన ఆరోపణలు చేశారు. మీడియాకు శుక్రవారం తన లాయర్ ద్వారా ఆయన ఒక ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఢిల్లీ సీఎంను ఉద్దేశిస్తూ వార్నింగ్ కూడా ఇచ్చారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో ఉక్కిరిబిక్కిరవుతున్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్.. తన లాయర్ అనంత మాలిక్ ద్వారా చేతిరాతతో కూడిన రెండు పేజీల లేఖను, ఒక పేజీ కవరింగ్ విజ్ఞప్తిని పత్రికలకు శుక్రవారం విడుదల చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మంత్రి సత్యేంద్ర జైన్ (ఇప్పుడు మాజీ) ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోనే రెడీగా ఉన్నా రూ.75 కోట్లలో రూ.15 కోట్లను 2020లోనే టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) పార్టీ ఆఫీసులో రేంజ్ రోవర్ (నెం. 6060) కారులో కూర్చుకున్న ‘ఏపీ’ (అరుణ్ రామచంద్ర పిళ్లయ్) అనే వ్యక్తికి అందించినట్టు (ప్రతినిధి ద్వారా) సుఖేశ్ చంద్రశేఖర్ ఆ ప్రెస్‌నోట్‌లో ఆరోపించారు. ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తు ముమ్మరంగా జరుగుతున్న టైమ్‌లో సుఖేశ్ ప్రెస్‌నోట్ ఆరోపణలు కలకలం సృష్టించాయి.
వాట్సాప్, టెలిగ్రామ్ మొబైల్ యాప్‌ల ద్వారా కేజ్రీవాల్, సత్యేంద్రజైన్‌తో జరిగిన చాటింగ్‌లో నగదుకు సంబంధించి కోడ్ భాషను వాడినట్టు ఆ లేఖలో సుఖేశ్ పేర్కొన్నారు. ‘ఒక్కో కేసులో 15 కిలోల నెయ్యి ఉన్నది. ఇందులో 15 కిలోల నెయ్యిని నా తరఫున టీఆర్ఎస్ ఆఫీసులో అందించు” అంటూ కేజ్రీవాల్ చాటింగ్ ద్వారా తనను ఆదేశించారని సుఖేశ్ అందులో తెలిపారు. ఒక్కో కేసు అంటే కార్టన్ బాక్స్ అని.. కిలో నెయ్యి అంటే ఒక కోటి రూపాయలు.. అని లేఖలో వివరించారు. హైదరాబాద్‌లో రెడీగా ఉన్న మొత్తం రూ. 75 కోట్లలో తన తరఫున రూ.15 కోట్లను ‘ఏపీ’ అనే వ్యక్తికి ఇవ్వాల్సిందిగా కేజ్రీవాల్ చెప్పారని పేర్కొన్న సుఖేశ్.. ఏపీ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న వ్యక్తి అని వివరించారు. సీబీఐ, ఈడీ అధికారులు సైతం ఇటీవల చార్జిషీట్లలో అరుణ్ రామచంద్ర పిళ్లయ్ పేరును షార్ట్ కట్‌లో ఏపీగా ప్రస్తావించారు.
కేజ్రీవాల్‌కు వార్నింగ్
మొత్తం 700 పేజీలకు సరిపోయే చాటింగ్ డేటా బ్యాకప్ ఉన్నదని, ఇప్పుడు ప్రెస్‌నోట్‌లో పేర్కొన్న విషయాలు కేవలం ఒక టీజర్ మాత్రమేనని, అసలైన సినిమా ఇక ముందు ఉంటుందని కేజ్రీవాల్‌కు సుఖేశ్ వార్నింగ్ ఇచ్చారు. రానున్న కాలంలో వాటిని కూడా విడుదల చేస్తానని తెలిపారు. “మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సోదరా.. ఇప్పటికైనా నా ఫ్యామిలినీ ఇబ్బంది పెట్టడాన్ని ఆపేయ్. చివరిసారిగా చెప్తున్నాను. మిమ్మల్ని అధికార పీఠాన్ని షేక్ చేయబోతున్నాను. మీ గోల్‌మాల్, అవినీతి చిట్టా బహిర్గతం కాబోతున్నది. సిద్ధంగా ఉండండి. చివరగా ఒక సలహా ఇస్తున్నాను. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించొద్దు. మీ కళ్లల్లో పాపభీతి స్పష్టంగా కనిపిస్తున్నది. తీహార్ జైలు క్లబ్‌లో చేరబోతున్న సంగతి మీకు తెలియందేమీ కాదు. మీ ఆటలన్నీ దాదాపు ముగింపుకు వచ్చాయి” అంటూ ఆ లేఖలో కేజ్రీవాల్‌ను హెచ్చరించారు. ఈ మధ్య తరచూ తన మీద, తన కుటుంబం మీద కేజ్రీవాల్ నిరంతరం ఒత్తిడి పెంచుతున్నారని లేఖలో సుఖేశ్ ఆరోపించారు. జైల్లో ఉన్న కేజ్రీవాల్ సహచరులు జైలు సిబ్బందిని నియంత్రిస్తూ ఫోన్ ద్వారా తన భార్య మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు.
తరచూ తనను ‘పెద్దన్న’గా సంబోధించాల్సిందిగా చెబుతూ ఉంటారని గుర్తుచేసిన సుఖేశ్... ఇకపైన వారి వెన్నులో వణుకు పుట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, భయంకరమైన రాత్రులు చూడబోతున్నారంటూ కేజ్రీవాల్‌ను ఉద్దేశిస్తూ ఆ లేఖలో పేర్కొన్నారు. కేజ్రీవాల్, సత్యేంద్రజైన్, తనకు మధ్య జరిగిన చాటింగ్ వివరాలను బహిర్గతం చేయబోతున్నట్టు ఇటీవల హెచ్చరించానని, డ్రామాలను, అవినీతి వ్యవహారాన్ని, అబద్ధాలను, వక్రీకరణలను బంద్ పెట్టాల్సిందిగా స్పష్టం చేసినట్టు సుఖేశ్ పేర్కొన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ ఒక పెద్ద జోక్‌గా మారబోతున్నట్టు సుఖేశ్ ఆ ప్రెస్‌నోట్‌లో తెలిపారు. ‘ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) ఔర్ కేజ్రీవాల్ భగావో’ అంటూ లేఖలో ప్రస్తావించిన సుఖేశ్.. చివరకు హ్యాపీ రామనవమి, జైశ్రీరాం అంటూ శుభాకాంక్షలు తెలిపారు. లాయర్ ద్వారా దీన్ని పంపించాల్సి వస్తున్నదని పేర్కొన్నారు.
ఎవరీ సుఖేశ్ చంద్రశేఖర్?
మనీ లాండరింగ్ చట్ట ఉల్లంఘనలకు పాల్పడి తీహార్ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్.. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాయ్‌ఫ్రెండ్. ఆయనకు మరో నటి నోరా ఫతేతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. రెలీగర్ కంపెనీ ప్రమోటర్ మల్వీందర్ కొన్ని ఆర్థిక వివాదాల్లో చిక్కుకుని కేసుల పాలై జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అతన్ని బయటకు తీసుకొస్తానని ఆయన భార్యను నమ్మించి రూ.200 కోట్ల మేర మోసం చేసినట్టు సుఖేశ్‌పై ఆరోపణలు ఉన్నాయి. చెన్నయ్ నగరానికి చెందిన సుఖేశ్ సముద్రతీరంలో ఖరీదైన బంగళా విదేశీ లగ్జరీ కార్ల (ఫెరారి, పోష్)తో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. పెళ్లయినప్పటికీ సినీ నటులతో పరిచయాలు, డేటింగ్ లాంటి యాక్టివిటీల్లో విచ్చలవిడిగా పాల్గొనేవారన్న ఆరోపణలూ ఉన్నాయి.
ఏడాదిన్నరగా జైలులో..
మనీ లాండరింగ్ కేసులో దాదాపు ఏడాదిన్నరగా తీహార్ జైల్లో ఉంటున్న సుఖేశ్.. ఇప్పుడు హఠాత్తుగా కేజ్రీవాల్, బీఆర్ఎస్ మధ్య సంబంధాలు ఉన్నట్టు లాయర్ ద్వారా ప్రెస్‌నోట్ రూపంలో లేఖ విడుదల చేశారు. అందులో పాత విషయాలను ఏకరువు పెట్టడం చర్చనీయాంశమైంది. నేరుగా ఎక్కడా కేసీఆర్ పేరును సుఖేశ్ ప్రస్తావించకపోయినా ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ మధ్య కుదిరిన రూ.75 కోట్ల డీల్‌లో రూ.15 కోట్లను హైదరాబాద్‌లోని ఆ పార్టీ (టీఆర్ఎస్) కార్యాలయంలో ‘ఏపీ’ అనే వ్యక్తికి ముట్టచెప్పినట్టు ఆరోపించడం సంచలనం రేకెత్తించింది. ఆప్, సౌత్ గ్రూపు పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య ఎక్సయిజ్ పాలసీ రూపకల్పన విషయంలో కుట్ర జరిగిందంటూ సీబీఐ, ఈడీ (ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ఆరోపిస్తున్న సమయంలో సుఖేశ్ ఆరోపణలకు ప్రాధాన్యం ఏర్పడింది.
మరింత రిస్కులో బీఆర్ఎస్?
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటూ వివాదాల్లో చిక్కుకున్న బీఆర్ఎస్ పార్టీని తాజాగా సుఖేశ్ చంద్రశేఖర్ ఆరోపణలతో మరింత చిక్కుల్లోకి నెట్టారు. సుఖేశ్ లేవనెత్తిన వాదనల్లో నిజమెంత.. అబద్ధమెంత.. అనే సంగతి ఎలా ఉన్నా 700 పేజీల వాట్సాప్ చాటింగ్ డేటా తన వద్ద ఉన్నదని, ఇది ట్రెయిలర్ మాత్రమే.. అసలు సినిమా ముందున్నది.. అంటూ కేజ్రీవాల్‌ను హెచ్చరించడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీకి కేజ్రీవాల్ సూచన మేరకే రూ.75 కోట్ల డీల్‌లో రూ.15 కోట్లు ముట్టాయని ఆరోపించడంతో ఇప్పటికే లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు చేస్తున్న ఈడీకి మరో అస్త్రం అందించినట్లయింది. రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన నిధులు, పొలిటికల్ ఫండింగ్ రూపంలో వచ్చిన విరాళాలు, ఎన్నికలకు చేసిన ఖర్చు తదితరాలన్నింటికీ సంబంధించిన వివరాలను, పార్టీ వార్షిక ఆడిట్ రిపోర్టుల లోతుల్లోకి వెళ్లి ఈడీ దర్యాప్తు జరిపే చాన్స్ ఉన్నది. అరుణ్ రామచంద్ర పిళ్లయ్ ఈడీ అధికారులకు గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్ల ప్రకారం.. సౌత్ గ్రూపు తరఫున కవితకు తాను ప్రతినిధిగా (ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో) వ్యవహరిస్తున్నానని పేర్కొన్నారు. దీన్ని ఉదహరిస్తూనే ఈడీ తరపు న్యాయవాది రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో పిళ్లయ్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ‘కవితకు బినామీ’ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే వ్యక్తి (పిళ్లయ్)కి రేంజ్ రోవర్ కారు (నెం 6060)లో టీఆర్ఎస్ పార్టీ (బీఆర్ఎస్) ఆఫీసు ఆవరణలో రూ.15 కోట్లను అందజేసినట్టు సుఖేశ్ ప్రస్తావించడంతో సరికొత్త ఆరోపణ తెరపైకి వచ్చినట్లయింది. పిళ్లయ్, కవితకు మాత్రమే కాకుండా బీఆర్ఎస్ పార్టీతోనూ సంబంధాలు ఉన్నట్లు సుఖేశ్ ద్వారా కొత్త విషయం వెలుగులోకి వచ్చినట్లయింది.
ఇదంతా ట్రాష్ : బీఆర్ఎస్ నేతలు
సుఖేశ్ చంద్రశేఖర్ తన లాయర్ ద్వారా పత్రికలకు విడుదల చేసిన ప్రెస్‌నోట్‌పై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఫైర్ అయ్యారు. చీటింగ్ కేసులో జైల్లో ఉన్న ఒక ఫోర్ ట్వంటీ.. బీఆర్ఎస్ ఇమేజ్‌ను డ్యామేజీ చేసేలా లేఖ రాయడాన్ని ఆ పార్టీ నేత క్రిశాంక్ తప్పుపట్టారు. గతంలో కేజ్రీవాల్ టార్గెట్‌గా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టార్గెట్‌గా లేఖలు రాస్తున్న సుఖేశ్ చంద్రశేఖర్.. ఇకపైన కర్ణాటకలో సిద్ధరామయ్య, 2024 ఎన్నికల టైమ్‌లో రాహుల్‌గాంధీలే టార్గెట్‌గా లేఖలు రాస్తారేమోననే అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ ఇలాంటి కుట్రలు చేస్తున్నదని ఆరు నెలల ముందే తాము గ్రహించామని, అమిత్ షా ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడతారని తాము ముందే ఊహించామన్నారు. ఒక చీటర్ ద్వారా ఇప్పుడు బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ.. ఆయన చేతే బీజేపీ లేఖ రాయించిందని వ్యాఖ్యానించారు. జైల్లో ఉన్న వ్యక్తి మీడియాకు లేఖలు ఎలా రాశారని, దీని వెనక బీజేపీ ప్రమేయం లేకపోతే ఇది సాధ్యమేనా? అని ప్రశ్నించారు.