Srisailam: పరవళ్లు తొక్కుతున్న శ్రీశైల జలాశయం.. పది గేట్లను ఎత్తిన అధికారులు

by Shiva |   ( Updated:2024-07-31 02:18:32.0  )
Srisailam: పరవళ్లు తొక్కుతున్న శ్రీశైల జలాశయం.. పది గేట్లను ఎత్తిన అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా పడుతుండటంతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగి శ్రీశైలం ప్రాజెక్ట్ పరవళ్లు తొక్కుతోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అధికారులు పది గేట్లను పది అడుగుల మేర పైకి ఎత్తి దిగువ సాగర్‌కు 2,75,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అదేవిధంగా జూరాల నుంచి 2,81,196 క్యూసెక్కులు, తుంగభద్ర ద్వారా 1,07,246 క్యూసెక్కులతో కలిపి 3,88,442 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 207.41 టీఎంసీలుగా ఉంది. తెలంగాణ పరిధిలోని ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్తు కేంద్రంలో గడిచిన 24 గంటల్లో 35,315 క్యూసెక్కుల నీటి సాయంతో 18.437 మిలియన్‌ యూనిట్‌ విద్యుత్ ఉత్పత్తి అయింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని కుడిగట్టు జల విద్యుత్తు కేంద్రంలో 25,684 క్యూసెక్కుల నీటితో 15.201 మిలియన్‌ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది.

Advertisement

Next Story
null