జాతీయ రహదారుల నిర్మాణంలో వేగం పెంచాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

by Shiva |
జాతీయ రహదారుల నిర్మాణంలో వేగం పెంచాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వం పదేళ్లలో జాతీయ రహదారుల నిర్మాణాల గురించి పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి కుంటుపడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అధికారులు గతాన్ని పక్కన పెట్టి జాతీయ రహదారి నిర్మాణ పనులను పరుగులు పెట్టించాలని మంత్రి ఆదేశించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి జాతీయ రహదారుల నిర్మాణాలను ఆపొద్దని.. ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. బుధవారం బంజారహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో జాతీయ రహదారులపై సమీక్షించారు.

భూసేకరణ, అటవీ అనుమతులు, బన్యన్ ట్రీల తొలగింపు వంటి అంశాలను సీరియస్‌గా తీసుకుని పని చేయాలని మంత్రి తెలిపారు. ప్రతివారం జాతీయ రహదారుల నిర్మాణ పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. విజయవాడ-నాగ్‌పూర్ (ఎన్‌హెచ్ 163)కి సంబంధించి భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా.. నిర్మాణ సంస్థ పనులు చేయడంలో జాప్యం జరుగుతుందని ఎన్ హెచ్ఏఐ ఆర్వో శివశంకర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వర్ రావు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి మెగా సంస్థ యాజమాన్యంతో మాట్లాడి.. భూ సేకరణకు ఇబ్బందులు లేని చోట, ఇప్పటికే భూసేకరణ చేసిన ప్రాంతాల్లో పనులను మొదలు పెట్టాలని అన్నారు. త్వరలోనే మంచిర్యాల, వరంగల్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి భూ సేకరణను వేగవంతం చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్ - డిండి (ఎన్‌హెచ్- 765) కి సంబంధించి రెండు వరుసల నుంచి నాలుగు వరుసలకు అప్‌గ్రేడ్ చేస్తున్న ఈ బ్రౌన్ ఫీల్డ్ రహదారిపై.. ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి‌తో సమావేశం ఏర్పాటు చేసి అలైన్‌మెంట్‌ను ఫైనల్ చేస్తామని.. వెంటనే డీపీఆర్ సిద్ధం చేసి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఖమ్మం - దేవరపల్లి (ఎన్.హెచ్.365జీజీ) గ్రీన్ ఫీల్డ్ రహదారి పనుల్లో నాణ్యత ప్రమాణాలను ప్రతీరోజు పరీక్షించాలని.. ఏదైనా నాణ్యతా లోపం ఉంటే సంబంధిత సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 2025 మే లేదా జూన్ కల్లా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులకు తేల్చి చెప్పారు.

ఆరు వరుసలుగా నిర్మిస్తున్న కర్నూల్ - రాయచూర్ (ఎన్.హెచ్-150సీ) గ్రీన్ ఫీల్డ్ రహదారి రెండు ప్యాకేజీలుగా పనులు జరుగుతున్నాయని.. మొదటి ప్యాకేజీ పనులు వచ్చే ఏడాది మే-జూన్ కల్లా పూర్తవుతాయని, రెండవ ప్యాకేజీలో టన్నెల్స్ వంటి నిర్మాణాలు ఉన్నందున ఈ పనులు 2025 డిసెంబర్ కల్లా పూర్తవుతాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇక హైదరాబాద్ - మన్నెగూడ (ఎన్.హెచ్-163) రహదారి పనులు అవార్డు అయ్యాయని 15 రోజుల క్రితం పనులు ప్రారంభించిన విషయం మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్ - నాగ్‌పూర్ (ఎన్.హెచ్ 44), హైదరాబాద్ బెంగళూర్ (ఎన్.హెచ్ 44) జాతీయ రహదారి పరిధిలో రోడ్ వైడెనింగ్, ఫ్లైఓవర్ల నిర్మాణాల్లో భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారిందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి భూసేకరణకు ఉన్న అడ్డంకులపై చర్చించి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed