- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సౌత్ గ్రూపు లాబీయింగ్.. డిసైడ్ చేసింది వాళ్లే!
దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించింది ఆ రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ కాదని, ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో నాలుగు రోజుల పాటు బస చేసిన సౌత్ గ్రూపు అని ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రూపొందించిన పాలసీలోని టాక్స్ స్ట్రక్చర్‌ను మంత్రివర్గం దగ్గరకు వెళ్లక ముందే సౌత్ గ్రూపు సభ్యులు డిసైడ్ చేశారని, చివరకు అదే ఫైనల్ అయిందని పేర్కొన్నది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనే వ్యవస్థ కేవలం అలంకారప్రాయమైనదేనని, లిక్కర్ పాలసీకి సంబంధించి టాక్స్ స్ట్రక్చర్‌పై ఎలాంటి చర్చలూ జరపలేదని, బయటి శక్తులే నిర్ణయాలు చేశాయని రిపోర్టులో పేర్కొన్నది.
పాలసీలో 12 శాతం టాక్స్ విధానంపై మంత్రుల బృందంలో ఎలాంటి చర్చలూ జరగలేదని, దాన్ని ఫిక్స్ చేసింది బయటి శక్తులేనని వివరించింది. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో 2021 మార్చి 14 నుంచి 17 తేదీల మధ్యలో సౌత్ గ్రూపు సభ్యులు బస చేశారని పేర్కొన్నారు. గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ తయారుచేసిన ముసాయిదా ప్రతిలోని 36 పేజీలను హోటల్‌లోని బిజినెస్ సెంటర్‌లో 15-16 తేదీల మధ్యలో ప్రింట్ తీసుకున్నారని, అక్కడే ముసాయిదాలోని 5 శాతం టాక్స్ అనే స్థానంలో 12 శాతం టాక్స్ ఫిక్సేషన్ జరిగిందని తెలిపింది.
సౌత్ గ్రూపునకు డ్రాఫ్ట్ పాలసీ
ఈ డాక్యుమెంట్‌ను మనీశ్ సిసోడియానే అందజేశారని, ఆయన ఆఫీసులోని కంప్యూటర్‌లో 15వ తేదీన ‘మై నోట్ ఆన్ జీవోఎం’ పేరుతో సేవ్ అయిన డాక్యుమెంట్‌ను సీబీఐ స్వాధీనం చేసుకున్నదని, ఆ డాక్యుమెంట్‌లో హోల్‌సేల్ ప్రాఫిట్ మార్జిన్ కేవలం 5 శాతంగా మాత్రమే ఉన్నదని, ఆ తర్వాత 19వ తేదీ నాటి డాక్యుమెంట్‌లో అది 12శాతంగా మారిందని, ఈ మార్పులతో కూడిన ఫైల్ సిసోడియా ఆఫీసు కాన్ఫరెన్సు రూమ్ కంప్యూటర్‌లో దొరికిందని ఈడీ పేర్కొన్నది.
జీవోఎం రూపొందించిన డ్రాఫ్ట్ ముసాయిదాలోని కొన్ని భాగాలు సౌత్ గ్రూపు సభ్యుల మొబైల్ ఫోన్లలో దొరికాయి. ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న సౌత్ గ్రూపునకు చెందిన ఒకరిని కస్టడీలోకి తీసుకుని విచారించిన సమయంలో అతని నుంచి సేకరించిన వివరాల మేరకు, స్టేట్‌మెంట్ల ఆధారంగా మొబైల్ డాటాను విశ్లేషించామని, ఆయన వాడుతున్న ఐ-ఫోన్ క్లౌడ్ డాటాను సేకరించామని, అతని మెయిల్ ఐడీ డంప్‌ను కూడా స్టడీ చేశామని తెలిపింది.
జాయింట్ ఎంక్వయిరీపై ఈడీ దృష్టి
అతని మెయిల్ డంప్‌లో సుమారు 1.23 లక్షల మెయిల్స్ ఉన్నాయని, వీటిని విశ్లేషిస్తూ ఉన్నామని, వీటి ఆధారంగానే ఆ వ్యక్తిని సిసోడియాతో కలిపి జాయింట్‌గా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నదని ఈడీ పేర్కొన్నది. ఎక్సయిజ్ శాఖ మాజీ కమిషనర్ రాహుల్‌సింగ్‌ను ఈ నెల 20న విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశామని తెలిపింది. మనీశ్ సిసోడియాకు గతంలో కార్యదర్శిగా పనిచేసిన ‘డానిక్స్’ అధికారి సి.అరవింద్‌ను ఈ నెల 21న విచారించనున్నామని ఈడీ తెలిపింది. ఇప్పటికే సీబీఐ దర్యాప్తులో అప్రూవర్‌గా మారిన దినేశ్ అరోరా, బడ్డీ రీటెయిల్స్ కంపెనీకి చెందిన అమిత్ అరోరాను ఈ నెల 20 లోపు విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది.
సౌత్ గ్రూపు కనుసన్నల్లో..
ఎక్సయిజ్ అధికారుల గమనంలోనే లేకుండా డ్రాఫ్ట్ పాలసీ తయారుకావడం, సౌత్ గ్రూపు సభ్యుల కనుసన్నల్లో టాక్స్ స్ట్రక్చర్‌లో మార్పులు జరగడం, హోల్‌సేల్ ప్రాఫిట్ 12 శాతానికి పెంచడం, మంత్రివర్గానికి చేరకముందే పాలసీ ఫైనల్ కావడం, అది సిసోడియా ఆఫీసు కంప్యూటర్లతో పాటు సౌత్ గ్రూపు సభ్యుల మొబైల్ ఫోన్లలో ప్రత్యక్షం కావడం.. ఇవన్నీ ఈడీ సీరియస్ పరిశీలనలో ఉన్నాయి. సిసోడియాకు, సౌత్ గ్రూపు సభ్యులకూ మధ్య ఉన్న లింకును బైటకు లాగడానికి, సీఎం కార్యాలయానికి రావాల్సిందిగా అరవింద్‌కు సమాచారం ఇవ్వడం వెనక కేజ్రీవాల్ ప్రమేయం ఏ మేరకు ఉన్నదో ఈడీ వెలికి తీయాలనుకుంటున్నది.
సిసోడియానే కీలకం..
జాయింట్ విచారణ జరపడం ద్వారానే లిక్కర్ స్కామ్‌లో సిసోడియా పాత్ర, ఆయనతో కుమ్మక్కై సౌత్ గ్రూపు ప్రమేయం వెలుగులోకి వస్తుందని, ఈ నెల 21వ తేదీ వరకు సమగ్ర వివరాలను రాబట్టడానికి జాయింట్ ఎంక్వయిరీలకు ప్లాన్ చేస్తున్నట్లు ఈడీ యాక్షన్ ప్లాన్‌ను ఆ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. సౌత్ గ్రూపులో సభ్యుడిగా పేర్కొన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి సైతం నోటీసు జారీచేసినందున ఆయన నుంచి రాబట్టే వివరాలకు అనుగుణంగా సిసోడియాతో జాయింట్ ఎంక్వయిరీ అవసరంపై ఈడీ నిర్ణయం తీసుకోనున్నది. ఈ నెల 20న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (ఈడీ అంచనా ప్రకారం సౌత్ గ్రూపులో కీలక సభ్యురాలు)తో పలువురిని కలిపి జాయింట్ ఎంక్వయిరీ ఉండే అవకాశమున్నది. మనీ లాండరింగ్ కోణం నుంచి దర్యాప్తు జరుపుతున్న ఈడీ.. సిసోడియాకు ప్రధాన ప్రమేయం ఉన్నట్లు ఆ రిపోర్టులో పేర్కొన్నది.