‘ఒక్క ఆధారం బయటపెట్టినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’

by GSrikanth |
‘ఒక్క ఆధారం బయటపెట్టినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎంపీ నగేశ్‌కు, తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని, తమ మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఒక్క ఆధారం బయటపెట్టినా తన పదవికి రాజీనామా చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ నగేశ్‌కు ఇవ్వాలని తాను చెప్పలేదని తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ నగేశ్ పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు పాయల్ శంకర్ తెలిపారు. తనకన్నా లక్ష రెట్లు ఎక్కువగా పార్టీ ఆలోచించి చేరికలను ప్రోత్సహిస్తోందన్నారు. ఆదిలాబాద్ టికెట్ ఎవరికనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఎవ్వరికివ్వాలన్నది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పని చేస్తామన్నారు.

ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఫ్రీ బస్సు తప్ప ఇతర గ్యారంటీలేవీ అమలు కాలేదని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శలు చేశారు. మంగళవారం రాష్ట్రప్రభుత్వం కేబినెట్ సమావేశం ఉందని, వంద రోజుల్లో ఇస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్‌ను సాకుగా చూపించి గ్యారంటీలు అమలుకాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. మార్చి 17తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తవుతుందని ఆయన గుర్తుచేశారు. గ్యారంటీలను అమలు చేశాకే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలన్నారు. అధికారం కోసం ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ నేతలు ప్రజలను మోసం చేశారన్నారు.

ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయమంటే ఖజానా ఖాళీ అయిందని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని పాయల్ శంకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కల్లిబొల్లి కబుర్లు చెప్పొద్దని, వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరని ఆయన చెప్పారు. ఆరు గ్యారెంటీల్లో చాలా ఉన్నాయని, అవన్నీ ఎప్పుడు అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ సాకుగా చూపించి రైతుల నోట్లో మన్ను కొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ఆయన విమర్శలు చేశారు. ఈనెల 17 లోపు ఆరు గ్యారంటీలను అమలు చేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed