పాఠశాల విద్యాశాఖ క్యాలెండర్ విడుదల..నెలకోసారి నో బ్యాగ్ డే

by Seetharam |   ( Updated:2023-06-07 14:58:52.0  )
పాఠశాల విద్యాశాఖ క్యాలెండర్ విడుదల..నెలకోసారి నో బ్యాగ్ డే
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇకపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతి నెలా నాలుగో శనివారాన్ని నో బ్యాగ్ డేగా పాటించనున్నారు. ఆ రోజు పిల్లలు పుస్తకాల బ్యాగ్ లేకుండా బడులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త విద్యా సంవత్సరానికి (2023-24) అకడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ కార్యదర్శి వాకాణి కరుణ జూన్ 6న జారీ చేశారు. దీంతో సంవత్సరంలో మొత్తం 10 రోజుల పాటు పిల్లలు సంచులు లేకుండా స్కూల్‌కి వెళ్లనున్నారు. ఆ రోజు పిల్లలతో స్కూళ్లు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.

ఈ సారి విద్యాశాఖ స్కూల్స్ మొదలవక ముందే క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరం మొత్తం 229 రోజుల పాటు పాఠశాలలు పనిచేయనున్నాయి. టీవీ పాఠాలు యాథావిధిగా ఉంటాయి. త్వరలో టైం టేబుల్ ప్రకటిస్తారు. రోజూ 30 నిమిషాలపాటు పుస్తకపఠనం ఉండేలా చూస్తారు. ప్రతిరోజూ అసెంబ్లీ ముందు లేదా తర్వాత 5 నిమిషాల పాటు యోగా, ధ్యానం ఉండాలని ఆదేశించారు. వారానికి 3 నుంచి 5 పీరియడ్లు ఆటలకు కేటాయించాలని సూచించారు. టెన్త్ క్లాస్ సిలబస్ జనవరి 24 వరకు పూర్తి చేయాలి.

సెలవులు కుదింపు:

ఈ సారి దసరా హాలిడేస్‌ను తగ్గించారు. గతేడాది 14 రోజులున్న సెలవులను ఈ ఏడాది 13 రోజులకు కుదించారు. క్రిస్మస్ సెలవులను 7 నుంచి 5 రోజులకు కుదించారు. దసరా సెలవులు అక్టోబర్ 13 నుంచి 25 వరకు, క్రిస్మస్ హాలిడేస్ డిసెంబర్ 22 నుంచి 26 వరకు ఉంటాయి. ఇక సంక్రాంతి సెలవులు 2024 జనవరి 12 నుంచి 17 వరకు ఇవ్వనున్నారు.

Advertisement

Next Story

Most Viewed