తెలంగాణ ఫార్ములానే మహారాష్ట్రలో.. పార్టీ విస్తరణకు కేసీఆర్ ప్లాన్

by Mahesh |
తెలంగాణ ఫార్ములానే మహారాష్ట్రలో.. పార్టీ విస్తరణకు కేసీఆర్ ప్లాన్
X

దిశ ప్రతినిధి, నిర్మల్: రాజకీయ వ్యూహాలు అమలు చేయడంలో దిట్టగా పేరున్న సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోను తెలంగాణ ఫార్ములా అమలు చేయనున్నారా..! ఇందుకోసం పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో భారత్ రాష్ట్ర సమితి తొలి సమావేశాన్ని నిర్వహించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలంగాణ తరహాలోనే... జడ్పీ పంచాయతీ సమితి ఎన్నికలకు సమాయత్తం...

కేసీఆర్ టీఆర్ఎస్ ఆవిర్భావం చేయడానికి ముందు తన డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి సిద్దిపేట ఉప ఎన్నికకు వెళ్లారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ కార్యాచరణ మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ ఎన్నికలు రావడంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అభ్యర్థులను పెట్టారు.

దీంతో పార్టీ విస్తృతమైంది అనేక చోట్ల ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలిచారు. నిజామాబాద్ కరీంనగర్ జడ్పీ చైర్మన్ స్థానాలు కూడా ఆ పార్టీకి దక్కాయి అలా పార్టీ విస్తరణ మొదలైంది. అదే ఫార్ములాను కేసీఆర్ మహారాష్ట్రలో అమలు చేసేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత మహారాష్ట్రలో తొలిసారిగా జరిగిన గత నెల 5 నాటి నాందేడ్ సభలో పెద్ద కేడర్ ఉన్న నేతలు ఎవరు ఎక్కువగా చేరలేదు.

అయితే నాందేడ్ జిల్లాతో పాటు పరిసర జిల్లాల నుంచి సర్పంచులు కొందరు ద్వితీయ శ్రేణి నేతలు భారత్ రాష్ట్ర సమితిలో చేరారు. వీరందరికీ త్వరలోనే జరగనున్న మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పిటిసిలుగా అవకాశం ఇస్తానని కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. దీంతో పార్టీలోకి చేరేందుకు ద్వితీయ శ్రేణి నేతలతో పాటు చిన్నాచితక లీడర్లను పార్టీలో చేర్చుకోవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. వీరంతా భారీ ఎత్తున పార్టీలో చేరితే గ్రామాల్లో పార్టీ విస్తరణ ఎక్కువగా జరుగుతుందని కేసీఆర్ కనిపిస్తుంది.

త్వరలోనే అక్కడ జరిగే జిల్లా పరిషత్ పంచాయతీ సమితి ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. ప్రతి పంచాయతీ సమితి పరిధిలో కనీసం మూడు జెడ్పిటిసి స్థానాలు 6 నుంచి 8 ఎంపీటీసీ స్థానాలు ఉంటాయని అంచనా. ఈ లెక్కన ఆయా నియోజకవర్గాల్లో ముఖ్యమైన నేతలను గుర్తించి వారికి టికెట్ ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే పార్టీ విస్తరిస్తుందని యోచిస్తున్నారు.

త్వరలోనే మహారాష్ట్రలో మరికొన్ని చోట్ల సమావేశాలు...

సీఎం కేసీఆర్ నాందేడ్‌లో సభ నిర్వహించిన నేపథ్యంలో మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో కూడా సమావేశాలు నిర్వహించాలని అక్కడి పలువురు నేతలు కోరుతున్నారని సమాచారం. రానున్న జడ్పీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపేవారు భారత్ రాష్ట్ర సమితిలో చేరేందుకు ముందు కేసీఆర్ సభలను పెట్టాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్ సైతం బహిరంగ సభలో సభల విషయాన్ని ప్రస్తావించాలి త్వరలోనే విదర్భ, ఉత్తర మహారాష్ట్ర, ముంబై బహిరంగ సభలు ఏర్పాటు చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 288 నియోజకవర్గాల్లో ఒకేరోజున పార్టీ ప్రచార వాహనాలు బయలుదేరుతాయని వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికలకు అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. దీన్నిబట్టి గతంలో తెలంగాణలో అమలు చేసిన ఫార్ములానే మహారాష్ట్రలోను అమలు చేసి పార్టీ విస్తరణను ముందుకు తీసుకెళ్లే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.

స్థానిక ఎన్నికలకు ఇన్చార్జిల నియామకం...

మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగుతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ మహారాష్ట్రలోని ఆయా జిల్లాలకు ఇన్చార్జిలను నియమిస్తున్నారు. గత రెండు రోజుల క్రితం అంతర్గతంగా జరిగిన పార్టీ సమావేశంలో జిల్లా ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. అమరావతి, యవత్మాల్, వార్దా జిల్లాలకు మాజీ మంత్రి నగేష్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాలకు బాల్క సుమన్, పురాణం సతీష్ తదితర నేతలు, నాందేడ్ జిల్లాకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తదితరులను ఇంచార్జీలుగా కేసీఆర్ నియమించారు. వీరంతా త్వరలోనే మహారాష్ట్ర వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్ర స్థాయి ప్రచారం చేపట్టనున్నారు.

Advertisement

Next Story