Rythu Bandhu : ఎన్నికలకు ముందే రైతుబంధు?

by Mahesh |   ( Updated:2023-10-24 03:58:20.0  )
Rythu Bandhu : ఎన్నికలకు ముందే రైతుబంధు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు సాయాన్ని అందిస్తున్నది. జూన్‌లో ఒకసారి, డిసెంబరులో మరోసారి రైతుల ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తున్నది. కానీ ఈసారి నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో డిసెంబర్ వరకు ఆగకుండా నవంబరులోనే ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నది. ఎన్నికల కారణంగా స్టేట్‌లో ఎలక్షన్ కోడ్ అమలవుతున్నందున ఈ స్కీమ్‌ను అమలు చేయాలంటే విధిగా కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ముందస్తు అనుమతి పొందడం తప్పనిసరి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలనుకుంటున్నది. అయితే ఈసీ నుంచి అనుమతి వస్తుందా? రాదా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది.

నెల రోజుల ముందే..

అన్ని స్కీముల అమలును అటకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు సాయం కోసం నిధులను సమకూర్చుకున్నది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే రైతుబంధు సాయాన్ని ఒక నెల రోజులు అడ్వాన్స్ చేసి ఎన్నికలకు ముందే రైతులకు అందించాలనుకుంటున్నది. ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో ఫండ్స్ రిలీజ్ చేయడం ఆనవాయితీ. కానీ ఈ సారి మాత్రం ఓట్ల పండుగ కావడంతో ప్రయోజనం పొందేందుకు ఈ తరహా కసరత్తు చేస్తున్నది. సుమారు రూ. 7,500 కోట్లు ఈ స్కీమ్ కోసం అవసరమైనందున ఎలక్షన్ కమిషన్ నుంచి సానుకూల స్పందన వచ్చిన వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేసేలా నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ సిద్ధం చేసుకుంటున్నది.

ఎన్నికలతో ఉనికిలోకి వచ్చిన స్కీమ్

తొలి టర్ములో ఉనికిలో లేని రైతుబంధు స్కీమ్‌ను 2018 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జూన్‌లో ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఒక్కో ఎకరానికి రూ. 4 వేల చొప్పున రాష్ట్రంలోని సుమారు 64 లక్షల మంది రైతులకు వారికున్న భూ విస్తీర్ణానికి అనుగుణంగా నేరుగా వారి ఖాతాల్లోనే జమచేసేలా రైతుబంధు స్కీమ్‌కు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా ఓట్లు రాలుతాయని కేసీఆర్ భావించారు. అనుకున్నట్లుగానే 2018 ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. ఈసారి కూడా అదే ఫార్ములాను బీఆర్ఎస్ అమలు చేయాలనుకుంటున్నది. త్వరలోనే రైతుబంధు నిధుల విడుదలకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాయనున్నట్లు అధికార వర్గాల సమాచారం.

సాయం పెంపునకు హామీ

రైతుబంధు కురిపించే ఓట్లను గమనంలోకి తీసుకొని ఈ సాయాన్ని దశలవారీగా పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. తొలుత ఎకరానికి ఒక సీజన్‌కు రూ. 4 వేలు ఉన్నదాన్ని రూ. 5 వేలకు పెంచామని, కొత్త ప్రభుత్వం ఏర్పడగానే దీన్ని ఐదేండ్ల వ్యవధిలో దశలవారీగా రూ. 8 వేలకు పెంచుతామన్నారు. ఆ ప్రకారం ఈ సాయం సంవత్సరానికి రెండు సీజన్లకు కలిపి రూ. 16 వేలకు చేరనున్నది. రైతుబంధు ద్వారా ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటున్న రైతులు కృతజ్ఞతగా ఓట్లు వేస్తారన్నది కేసీఆర్ ఆలోచన. అందువల్లనే ఈసారి పోలింగ్‌ కంటే ముందే రైతుబంధు సాయం ఇస్తే దానికి ప్రతిఫలంగా ఓట్లు పొందవచ్చన్నది ప్లాన్.

ఎన్నికల టైమ్‌లోనే కొత్త స్కీమ్‌లు

ఎన్నికలు వచ్చినప్పుడల్లా కొత్త స్కీమ్‌లను తెరపైకి తీసుకురావడం కేసీఆర్ పొలిటికల్ స్ట్రాటెజీ. గత అనుభవాలు కూడా దీన్నే ధృవీకరిస్తున్నాయి. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా దళితబంధు స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. దళిత కుటుంబాలకు వన్ టైమ్ సాయంగా రూ. 10 లక్షలను ప్రకటించారు. అయినా హుజూరాబాద్‌లో చేదు అనుభవమే వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వరదల నష్టం పేరుతో తలా రూ. 10 వేల సాయాన్ని బాధితులకు నగదు రూపంలో ఇచ్చారు. ఇక్కడ కూడా ఆశించినంతటి స్థాయిలో సాలిడ్ మెజారిటీ రాలేదు. ఈసారి కాంగ్రెస్‌తో గట్టి పోటీ ఎదుర్కొంటున్నందున మరోసారి రైతుబంధు ద్వారా ఓటర్లకు రుచి చూపించే ప్రయత్నం జరుగుతున్నది.

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డబుల్ ఇండ్ల పంపిణీ, గృహలక్ష్మి పేరుతో సొంతింటి నిర్మాణానికి రూ. 3 లక్షల సాయం, చేతివృత్తులకు చేయూత పేరుతో బీసీలకు రూ. లక్ష సహాయం, మైనారిటీలకు ఇంతే మొత్తంలో పంపిణీ, విద్యార్థులకు స్కూళ్లలోనే బ్రేక్ ఫాస్ట్ అందించడం.. ఇలాంటివి లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో ఏవీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అన్నీ మొక్కుబడి ప్రారంభోత్సవాలతోనే ఆగిపోయాయి. సంక్షేమానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా మిగిలిందని చెప్పుకోడానికి, ఎన్నికల ప్రచారం సమయంలో ఆన్-గోయింగ్ స్కీమ్‌ల పేరుతో ముమ్మరంగా అమలు చేయడానికే వీటిని ప్రభుత్వం లాంచ్ చేసినట్లు కనిపిస్తున్నది.

ఈసారి వర్కవుట్‌పై అనుమానాలు

కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక పర్మిషన్ తెచ్చుకుని రైతుబంధు సాయాన్ని అందించినా, అది ఏ మేరకు ఓట్లు రాలుస్తుందనే అనుమానాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. పర్మిషన్‌పై గులాబీ నేతల్లో అనుమానాలు ఉన్నప్పటికీ రైతులు కూడా ఈసారి భిన్నంగా స్పందిస్తున్నారు. పేదలకు ఉపయోగపడాల్సిన పంట పెట్టుబడి సాయం భూస్వాములకు కూడా ప్రభుత్వం అందించడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. వారి కోసమే కేసీఆర్ ఈ స్కీమ్ పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. పంట కొనుగోళ్లకు గిట్టుబాటు ధర అమలు చేస్తే రైతుబంధు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని అభిప్రాయాలనూ వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరహా వ్యాఖ్యల నేపథ్యంలో ఆశించిన స్థాయిలో రైతుబంధు ఓట్లను కురిపిస్తుందా లేదా అనే భయం అధికార పార్టీ అభ్యర్థులను వేధిస్తున్నది. సిక్స్ గ్యారెంటీస్ లో కాంగ్రెస్ ప్రకటించిన వరి పంటకు రూ. 500 బోనస్, గిట్టుబాటు ధర పెంపు, రైతుబంధు సాయాన్ని రూ. 15 వేలకు పెంచడం.. ఇవన్నీ రైతుల్ని పునరాలోచనలోకి నెట్టాయి.

Advertisement

Next Story