Harish Rao : రిటైర్మెంట్ ఉద్యోగుల అరిగోస : హరీష్ రావు

by Y. Venkata Narasimha Reddy |
Harish Rao : రిటైర్మెంట్ ఉద్యోగుల అరిగోస : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : రిటైర్మెంట్ బెనిఫిట్స్(Retirement Benefits) ఇవ్వకుండా విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు అరిగోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండటం దుర్మార్గమని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)ఎక్స్ వేదికగా విమర్శించారు. 30 ఏళ్ల పాటు ప్రజలకు సేవలందించిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? వారి ఆవేదన ఈ ప్రభుత్వానికి అర్థం కాదా? అని మండిపడ్డారు. 2024 మార్చి తర్వాత రిటైర్ అయిన దాదాపు 8వేల మంది పీఎఫ్, గ్రాట్యుటీ, ఎల్ఐసీ, కమ్యుటేషన్, సరెండర్ లీవ్ తదితర ప్రయోజనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు.

దిక్కుతోచని స్థితిలో పడిపోయి, మానసిక వేదనకు గురవుతున్నారని.. అనారోగ్యం పాలవుతున్నారని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయంలో, విశ్రాంత ఉద్యోగుల ఆనందాన్ని దూరం చేసిన దుర్మార్గ ప్రభుత్వం ఇదన్నారు. హక్కుగా తాము పొందాల్సిన బెనిఫిట్స్ కోసం ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగేలా చేసిందని.. పైరవీలు చేసుకోవాల్సిన దుస్థితిని కల్పించిందని విమర్శించారు. బిడ్డ పెళ్లి కోసం ఒకరు, కొడుకు ఉన్నత విద్య కోసం మరొకరు, భార్య అనారోగ్యం పాలైతే మంచి వైద్య చికిత్స అందించడం కోసం మరొకరు.. ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కళ్లలో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారన్నారు.

నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుండి కనీస స్పందన లేకపోవడం ఉద్యోగులు, టీచర్ల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపుతున్న కర్కశత్వానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కండ్లు తెరవాలని, ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి చెల్లించాల్సిన 80- 90 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తుందని స్పష్టం చేస్తున్నామని పేర్కొన్నారు.

కాగా రాష్ట్రంలో రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక 2024 మార్చి తర్వాత పదవి విరమణ చేసిన 7,995మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి సగటున రూ.60నుంచి 70లక్షల మేరకు చెల్లింపు జరుగాల్సి ఉంది. వారి గ్రాట్యూటీ, జీపీఎఫ్, ఎల్ఐసీ, కమ్యూటేషన్ బిల్లులన్ని పెండింగ్ లో ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగులకు సంబంధించి రూ.5వేల కోట్ల మేరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులు ఇంతకాలంగా దాచుకున్న సొమ్మును తిరిగి వారికి ఇవ్వడానికి ప్రభుత్వం జాప్యం చేస్తుండటాన్ని ఉద్యోగులు తప్పుబడుతున్నారు. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఇంటి రుణాలు, ఇతర అప్పులు, ఆరోగ్య ఖర్చులు వంటి ఎన్నో పనులు నిలిచిపోయి ఇబ్బంది పడుతున్నామని రిటైర్మెంట్ ఉద్యోగులు వాపోతున్నారు.

Next Story

Most Viewed