రీజనల్ రింగు రోడ్డు నిధులు విడుదల చేయండి: సీఎంకు కేంద్ర మంత్రి లేఖ

by sudharani |
రీజనల్ రింగు రోడ్డు నిధులు విడుదల చేయండి: సీఎంకు కేంద్ర మంత్రి లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: నగరానికి తలమానికంగా రూ. 26 వేల కోట్లకు పైగా అంచనా వ్యయంతో దాదాపు 350 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న రీజనల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) భూ సేకరణకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా రీజనల్ రింగు రోడ్డు భూసేకరణ వ్యయంలో 50 శాతం నిధులను ఎన్‌హెచ్ఏఐకు డిపాజిట్ చేయాలని లేఖలో కోరారు.

ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుండగా.. భూసేకరణ వ్యయంలో మాత్రం 50 శాతం ఖర్చును కేంద్ర ప్రభుత్వం, మిగతా 50 శాతం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఇరు ప్రభుత్వాలు అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్రం హైదరాబాద్ నగరం చుట్టూ 'గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే' (రీజనల్ రింగు రోడ్డు)ను నిర్మించటానికి మంజూరు చేయడమే కాకుండా.. కార్యాచరణకు గెజిట్ కూడా విడుదల చేసిందని వివరించారు. అయినప్పటికీ భూసేకరణ వ్యయానికి సంబంధించిన విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు ముందుకురాలేదన్నారు.

2022-23 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో రీజనల్ రింగు రోడ్డు భూసేకరణ పేరుతో రూ. 500 కోట్లు కేటాయించినప్పటికీ వాటిని ఇంతవరకు విడుదల చేయకపోవడం దురదృష్టకరమన్నారు. రీజనల్ రింగు రోడ్డు వల్ల హైదరాబాద్ నగరానికి వచ్చి, వెళ్ళే వాహనాల రద్దీని నియంత్రించడంతోపాటు తెలంగాణ ప్రాంత ప్రజలు అభివృద్ధి సాధిస్తారని పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ రింగు రోడ్డు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన మేరకు భూసేకరణ వ్యయంలో 50 శాతం నిధులను వీలైనంత త్వరగా డిపాజిట్ చేసి, తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి సహకరించాలని లేఖలో కోరారు.

Advertisement

Next Story

Most Viewed