పాలు కొనడానికి నిరాకరిస్తోన్న విజయ, మదర్ డెయిరీ యాజమన్యాలు

by Anjali |
పాలు కొనడానికి నిరాకరిస్తోన్న విజయ, మదర్ డెయిరీ యాజమన్యాలు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా పాల ఉత్పత్తిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలు కొనుగోలు చేయడానికి విజయ, మదర్ డెయిరీ యాజమాన్యాలు నిరాకరిస్తుండడంతో.. ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. బిల్లుల చెల్లింపుల్లోనూ తీవ్ర ఆలస్యమవుతుండటంతో పాడి రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.4 ప్రోత్సాహకం ప్రకటించినా.. చెల్లించడంలో విఫలమైందనే విమర్శలున్నాయి. మరోవైపు పాల ఉత్పత్తిలో అధునాతన పద్ధతులను తీసుకురావడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే ఆరోపణలున్నాయి. డెయిరీ యాజమాన్యాల తీరుతో రాష్ట్రంలోని పాడిపరిశ్రమ నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది.

ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి!

విజయ డెయిరీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుండగా... రైతు సొసైటీల సహకారంతో ‘మదర్’ డెయిరీ కొనసాగుతున్నది. ఈ రెండు డెయిరీలు ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగానే నడుస్తాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాడి పరిశ్రమను పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. దీంతో డెయిరీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో లీటర్ పాలకు రూ.40 నుంచి రూ.45 వరకు చెల్లించాల్సి వస్తుండగా.. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల నుంచి వచ్చే పాలకు అధిక ధర చెల్లిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే పాలు లీటర్‌కు రూ.22 నుంచి రూ.30కే అందుబాటులో ఉంటున్నాయనే సమాచారం. తక్కువ ధరకు లభిస్తుండడంతో డెయిరీల యాజమాన్యాలు పాలు దిగుమతి చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తున్నది.

బిల్లుల చెల్లింపులోనూ ఆలస్యం..

తెలంగాణలో పాలు అందుబాటులో లేనప్పుడు డెయిరీలు ఇతర రాష్ట్రాల నుంచి పాలను సేకరిస్తాయి. అయితే రాష్ట్రంలో పాలు అందుబాటులో ఉన్నా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడానికి ప్రాధాన్యమిస్తుండడం విమర్శలకు తావిస్తున్నది. దీంతో జిల్లాల రైతుల నుంచి పాలు తీసుకునేందుకు డెయిరీలు నిరాకరిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా పాత బిల్లులను సైతం రైతులకు చెల్లించడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో రైతులు మరోసారి పాలు తీసుకురాకుండా చేసి.. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేందుకు డెయిరీ యాజమాన్యాలు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

సేల్‌కు మించి పాల ఉత్పత్తి : డెయిరీ అధికారులు

రంగారెడ్డి జిల్లాలో విజయ డెయిరీ రోజుకు 60 వేల లీటర్లు, మదర్ డెయిరీ 23 వేల లీటర్ల పాలను సేకరిస్తాయి. అయితే ఈ పాలు పూర్తిస్థాయిలో అమ్ముడుపోవడం లేదని డెయిరీ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయ డెయిరీ నుంచి రోజుకు 1.03 లక్షల లీటర్లు, మదర్ డెయిరీ నుంచి 80 వేల లీటర్ల పాలు మాత్రమే సేల్ అవుతున్నాయని అంచనా వేస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే అమ్మకానికి మించి పాల ఉత్పత్తి జరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు. దీంతో సేకరించిన పాలను పౌడర్‌గా మార్చి మార్కెట్లో విక్రయిస్తున్నామని పేర్కొంటున్నారు. అందుకే రైతులకు బిల్లులు చెల్లించడంలో ఆలస్యమవుతున్నదని చెబుతున్నారు. బిల్లు అడిగితే పాలు వద్దంటున్నారు. కందుకూర్ మండల కేంద్రంలోని డెయిరీలో ఉదయం, సాయంత్రం కలిపి రోజుకు 30 లీటర్ల పాలు పోస్తాను. ఫ్యాట్ ఆధారంగా లీటర్‌కు రూ.40 వరకు చెల్లిస్తారు. గతంలో పదిహేను రోజులకోసారి బిల్లులు చెల్లించేవారు. కానీ కొన్ని నెలల నుంచి బిల్లులు చెల్లించడానికి ఇబ్బందులు పెడుతున్నారు. ప్రశ్నిస్తే పాలు తీసుకురావద్దని చెబుతున్నారని పాడి రైతు మహేష్ తెలిపారు.

పాడి పరిశ్రమపైనే మా జీవనం

ఉదయం, సాయంత్రం కలిపి రోజుకు 80 లీటర్ల పాలు డెయిరీలో పోస్తాను. నాలుగైదు నెలల నుంచి బిల్లుల చెల్లింపులో ఆలస్యం చేస్తున్నారు. మా కుటుంబ జీవనం పాడిపరిశ్రమతోనే ముడిపడి ఉంది. ప్రభుత్వ ఆధీనంలో నడిచే డెయిరీ కావడంతో ఎప్పటికైనా బిల్లులు చెల్లించకపోతారా అనే నమ్మకంతోనే పాలు పోస్తున్నామని పాడి రైతు శ్రీశైలం వెల్లడించారు.



Next Story