వెల్జాల్ వేదాద్రి లక్ష్మీ నరసింహుడి మహిమలు చూడతరమా..

by Sumithra |
వెల్జాల్ వేదాద్రి లక్ష్మీ నరసింహుడి మహిమలు చూడతరమా..
X

దిశ, తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలానికి చెందిన వెల్జాల్ గ్రామ సమీపంలో ఎత్తైన కొండల పై వెలసిన శ్రీ వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహిమలు లీలలు వర్ణించడం ఎవరి తరం కాదు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం ఈ ఎత్తయిన గుట్టపై సాక్షాత్తు యాదగిరి లక్ష్మి నరసింహుడే ఇక్కడ వెలిసినట్టు ఇక్కడి పూర్వికులు కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆనాటి కాలంలో భారీగా వర్షాలు కురిసి ఈ రెండు గుట్టల మధ్య నుండి నీరు వెలుపలికి జాలులుగా పారడంతోనే వెల్జాల్ గ్రామంగా పిలవబడుతుంది.

రెండు ఎత్తయిన గుట్టల మధ్యన వెలిసిన వెల్జాల్ గ్రామానికి పడమర దిక్కున కొండ పై స్వయంభుగా లక్ష్మీనరసింహస్వామి వెలసి భక్తులు కోరిన కోరికలు నెరవేర్చడంలో కొంగుబంగారం ఆయన సొంతం. ఈ గుట్టపై పూర్వకాలంలో వేద పండితులు వేద అధ్యయనం చేయడంతోనే వేదాద్రి గుట్టగా పిలవబడుతుందని ఇక్కడి పూర్వికులు పేర్కొన్నారు. భక్తుల పాలిట కల్పవృక్షమై పరిసర ప్రాంతాల భక్తులు స్వామివారి అనుగ్రహంతో, కరుణాకటాక్షాలతో భక్తులు కోరే కోరికలు నెరవేర్చుతూ నేడు ఆ లక్ష్మీనరసింహుడు ప్రతి నిత్యం పూజలు అందుకుంటున్నాడు. పూర్వకాలంలో ఈ గుట్టపై స్వామివారి దర్శన భాగ్యం కలగాలంటే పడుకొని లోనికి వెళ్లి పూజలు నిర్వహించవలసిన పరిస్థితి ఉండేది. అనంతరం కొన్ని రోజులు గడిచిన తర్వాత కూర్చొని గర్భగుడిలోకి వెళ్లి పూజలు చేసుకునే వెసులుబాటు భాగ్యం కలిగిందని ఇక్కడి పూర్వికులు చెప్తుంటారు.

దేవాలయం పైకి వాహనాలు వెళ్లడానికి లక్షల రూపాయలతో సీసీ రహదారి నిర్మాణం, గుట్ట కింది భాగంలో చూడముచ్చటైన ముఖద్వారం ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఆ లక్ష్మీనరసింహుడి అనుగ్రహంతో దేవాలయం మొత్తం దినదినాభివృద్ధి చెందుతూ భక్తులు అందించిన విరాళాలతో సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో దేవాలయం ఊహకందని రీతిలో అభివృద్ధి చెందింది. ఈ గుట్టపై కి వెళ్లిన తర్వాత స్వామివారి దర్శన భాగ్యం అనంతరం ఎటు చూసినా పల్లెలన్నీ కళ్ళ కట్టినట్లుగా కనిపిస్తూ ఉంటాయి. గుట్టకు ఈశాన్య భాగాన మండలంలోనే అత్యంత విశాలమైన పెద్ద చెరువు సహదేవి సముద్రం నిండుకుండలా ఉండి పక్షుల కిలకిల రాగాల శబ్దంతో వినిపిస్తూ ఉంటే ఇది స్వామివారి అనుగ్రహం మాత్రమేనని ఇక్కడి భక్తులు ప్రగాఢ విశ్వాసం.

ఈనెల 12 నుండి 16 వరకు బ్రహ్మోత్సవాలు

ఈనెల 12న గణపతి పూజ, స్వస్తివాచనం, సంప్రోక్షణం, సాయంత్రం నాలుగు గంటలకు గ్రామంలో విగ్రహాల ఊరేగింపు. 13న గణపతి పూజ, గోపూజ, రక్షాబంధనం, రాత్రి 7 గంటలకు జలాధివాసం, మంగళహారతులు. 14న నిత్య పూజల తో పాటు మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాయిక పూజ, లక్ష పుష్పార్చన.15న శ్రీశ్రీశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రిచే 7 గంటల వరకు ప్రవచనాలు నిర్వహించబడును. 16న తెల్లవారుజామున నుండి నిర్వహించే నిత్య పూజలతో పాటు, ఉదయం 9 గంటలకు విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట, మధ్యాహ్నం 11:30 గంటలకు శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం, సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి ని పల్లకి సేవలో ఊరేగింపు తో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ అనువంశిక ధర్మకర్త ప్రధాన అర్చకుడు గుడా యాదగిరి నరసింహ శర్మ చార్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామపంచాయతీ పాలకవర్గం పేర్కొన్నారు.

Advertisement

Next Story