ఆమడ దూరంలో ఆధార్ కేంద్రం.. అవస్థలు పడుతున్న జనం

by Shiva |
ఆమడ దూరంలో ఆధార్ కేంద్రం.. అవస్థలు పడుతున్న జనం
X

దిశ, ఆమనగల్లు : ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, ఇతర గుర్తింపు పత్రాలు తీసుకోవాలన్నా, విద్యార్థులు పై చదువులకు వెళ్లాలన్నా, ప్రస్తుతం మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కాలన్నా ఆధార్ తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల అమలు దరఖాస్తుల స్వీకరణకు సైతం ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి, కొత్తగా పొందడానికి, ఉన్నవారు ఫోన్ నంబర్ లింక్ చేసుకోవడానికి ఆధార్ సెంటర్ లేక రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడుగుల మండల ప్రజలు తీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ సేవల కోసం వేరే జిల్లాలకు వెళ్లాల్సి వస్తుంది.

ఆరు గ్యారంటీలకు ఆధారే..

నాలుగు మండలాలకు కూడలి అయిన ఆమనగల్లు పట్టణ కేంద్రంలో ఆధార్ సెంటర్ లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలకు అర్హత సాధించేందుకు ఆధార్ తప్పనిసరి అయ్యింది. దీంతో కొత్తగా నమోదు, అప్డేషన్ కోసం దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తుంది. వివాహం కావడం, ఇంటిపేరు, కేరాఫ్ చిరునామా, ఉద్యోగ, ఉపాధి రీత్యా, నివాసం, మొబైల్ నంబర్ మారడంతో అప్డేషన్ ఆవశ్యకత ఏర్పడింది. కాంగ్రెస్ గ్యారంటీల అమలు దరఖాస్తుల్లో ఆధార్ తప్పనిసరి చేయడంతో ప్రజలు అప్డేట్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బస్సు ఎక్కాలంటే..

మహాలక్ష్మి పథకంతో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పొందాలంటే ఆధార్ అప్డేట్ లేకపోతే టికెట్ ఇస్తున్నారు. ఉచిత ప్రయాణానికి గుర్తింపు కార్డులో ఫొటోలు స్పష్టంగా ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు. కానీ చాలామంది ఆధార్ కార్డులో చిన్నతనం నాటి ఫొటోలున్నాయి. వాటిని అప్డేట్ చేసుకోవడానికి నాలుగు మండలాల్లో ఆధార్ సెంటర్ లేకపోవడంతో ప్రభుత్వ పథకాలను మహిళలు కోల్పోతున్నారని అసంతృప్తితో ఉన్నారు. వెంటనే ఆమనగల్లు పట్టణ కేంద్రంలో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed