Rajendra Nagar: ఫ్రెండ్స్ కాలనీ పేరుతో.. ప్రభుత్వ భూమి స్వాహా

by Ramesh Goud |
Rajendra Nagar: ఫ్రెండ్స్ కాలనీ పేరుతో.. ప్రభుత్వ భూమి స్వాహా
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : జిల్లాలో రెవెన్యూ అధికారుల అండదండలతో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను రియల్టర్లు అప్పనంగా కొట్టేస్తున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు గద్దల్లా వాలి కబ్జాల పరంపర కొనసాగిస్తున్నారు. రియల్టర్లు, రాజకీయ నాయకులు కుమ్మక్కై పెద్ద మొత్తంలో కబ్జాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజేంద్రనగర్ మండలంలో ఈ దందా పెద్ద ఎత్తున సాగుతోంది.

రాజేంద్రనగర్‌లో 100ఎకరాలకు పైన ఆక్రమణ

హైదరాబాద్​నగరానికి కూతవేటు దూరంలో ఉన్న రాజేంద్రనగర్​మండలం మైలార్​దేవరపల్లి రెవెన్యూ పరిధిలోని 156 సర్వే నెంబర్​లో 439.27 ఎకరాల ప్రభుత్వం భూమి ఉంది. ఇందులో ఇతరత్రా ప్రజా అవసరాల కోసం గత ప్రభుత్వాలు 314.12ఎకరాల భూమిని టీఎన్జీవో కాలనీ, పద్మశాలిపురం, మధుభన్​కాలనీ, ఇండస్ట్రీయల్​కు కేటాయించారు. మరో 4.33ఎకరాలను ఆలయం, 3.07ఎకరాలను మైనార్టీ స్కూల్​కు ప్రభుత్వాలు కేటాయించాయి. మిగిలిన 117 ఎకరాల భూమిలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇటీవల కొందరు వ్యక్తులు సుమారుగా మూడెకరాల స్థలంలో భారీ లే అవుట్​ నిర్మించారు. 156/1 సర్వే నెంబర్​లో ఫ్రెండ్స్​ కాలనీ పేరుతో రోడ్లు, చుట్టూ ప్రహరీ నిర్మించారు. దీనిపై గతంలో తహశీల్దార్, సబ్​ రిజిస్ట్రార్లకు ఫిర్యాదు చేసినా తూతూమంత్రంగా కూల్చివేసి వదిలేశారు. అనంతరం ఆ స్థలంలో ఇంకా నిర్మాణాలు కొనసాగుతున్నా అధికారులు ఘాడ నిద్రలో ఉన్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఆక్రమణల వెనక ఓ పెద్ద స్థాయి ప్రజాప్రతినిధి​ ఉన్నాడా..?

గత ప్రభుత్వంలో కబ్జాకు విషయమై స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున సంబంధిత అధికారులకు 2023 మార్చిలో ఫిర్యాదు చేశారు. కాగా అధికారులు తాత్కాలిక చర్యలతో మౌనం వహించారు. అయితే ఈ భారీ స్థాయిలో లే అవుట్​ చేసిన వ్యాపారి వెనుక ఓ పెద్ద స్థాయి ప్రజా ప్రతినిధి ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఆయన కనుసన్నల్లోనే రియల్​వ్యాపారి యథేచ్ఛగా లే అవుట్​ చేసి అక్రమంగా క్రయ విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ నిబంధనలతో లే అవుట్​ చేశారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

కొరవడిన సమన్వయం

జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతోనే అక్రమ కట్టడాలు, నిర్మాణాలతో పాటు లే అవుట్లు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతుంది. అంతేగాక అధికారులు తాయిలాలకు ఆలవాటు పడి కోట్ల విలువైన భూమిని రియల్​వ్యాపారి చేతిలో పెట్టేందుకు అన్ని రకాల మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫిర్యాదులు చేసినా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాంటి భూములపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ భూములను కాపాడటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

Advertisement

Next Story