రోడ్డంతా గుంతలు.. ప్రయాణికుల చింతలు..

by Sumithra |
రోడ్డంతా గుంతలు.. ప్రయాణికుల చింతలు..
X

దిశ, ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రం నుండి నాగన్ పల్లి గ్రామం ముందు వరకు, పోల్కంపల్లి గ్రామం నుండి రాయపోల్ వరకు ఉన్న రోడ్డు మొత్తం గుంతలు ఏర్పడి, అద్వానంగా తయారై ప్రమాదాలకు నిలయంగా మారింది. అలాగే ఇరుకుగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇరుకు రోడ్డు పై ప్రయాణికులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని ఇరుకు రోడ్డు పై ఒకేసారి రెండు వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

ఇబ్రహీంపట్నం, నాగన్ పల్లి, పోల్కంపల్లి గ్రామాల పక్కనే రామోజీ ఫిల్మ్ సిటీ ఉండడం, ఈ రోడ్డు పై అక్టోపస్, ఎన్ఎస్జీ, వైట్ గోల్డ్, బీడీఎల్ వంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఉండడంతో నిత్యం ఈ రోడ్డు రద్దీగా ఉంటుందంటున్నారు. అలాగే ఈ రోడ్డు పై యాదగిరిగుట్ట, చౌటుప్పల్, హయత్ నగర్, దండుమైలారం, తాళ్లపల్లి గూడ ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తుంటాయంటున్నారు. ఇప్పటికైనా ఈ రోడ్డును వెడల్పు చేసి నూతన రోడ్డును వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గతంలో అధికారులకు ఈ రోడ్డు పరిస్థితి గురించి విన్నవించినా పట్టించుకున్న నాథుడే లేడని స్థానికులు మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed