హైడ్రా అధికారులు దూకుడు.. అక్ర‌మ నిర్మాణ‌దారుల్లో గుబులు

by Nagam Mallesh |
హైడ్రా అధికారులు దూకుడు.. అక్ర‌మ నిర్మాణ‌దారుల్లో గుబులు
X

దిశ‌, గండిపేట్ : అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్కడున్న నిర్మాణం ఎవరిది, అవతల ఉన్న వారు ఎంత పెద్ద వారు అని కూడా చూడట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైడ్రా అధికారులు దూసుకుపోతున్నారు. ఎక్కడ అక్రమ నిర్మాణాలు కనిపిస్తే అక్కడ కూల్చివేసేస్తున్నారు. ఇప్పుడు హైడ్రా సెగ గండిపేట్‌కు త‌గిలింది. గండిపేట్ మండ‌ల ప‌రిధిలో అక్ర‌మంగా చేప‌ట్టిన నిర్మాణాల‌ను కూల్చేస్తు్నారు. ఆదివారం గండిపేట్ చెరువు ఖానాపూర్‌లో ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ల ప‌రిధిలోని స‌ర్వే నెంబ‌ర్ 233/2 లో నిర్మించిన ప్ర‌హారీగోడ‌లు, స‌ర్వే నెంబ‌ర్ 246 స‌ర్వే నెంబ‌ర్ ఓఆర్ఓ స్పోర్ట్స్ లో నిర్మాణాలు, నార్సింగి మున్సిపాలిటీ ప‌రిధిలోని గండిపేట్ చెరువులోని స‌ర్వే నెంబ‌ర్ 63లో అక్ర‌మ నిర్మాణాల‌ను, ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోని పాల‌మూరు గ్లో అనే హోట‌ల్ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.

స‌ర్వే నెంబ‌ర్ 246 లో అక్ర‌మ నిర్మాణంపై ఓ మ‌హిళ ఎన్‌జీటీ కింద కోర్టును ఆశ్ర‌యించిన‌ట్లు విశ్వ‌స‌నీయ‌ స‌మాచారం. ఉద‌యం నుంచే టౌన్‌ప్లానింగ్‌, ఇరిగేష‌న్‌, జ‌ల‌మండ‌లి అధికారులు కూల్చివేత‌లు చేప‌ట్ట‌గా పోలీసు శాఖ భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేసింది. దీంతో నిర్మాణ‌దారులు హైడ్రా అధికారుల‌తో వాద‌న‌కు దిగినా వారిని లెక్క చేయ‌కుండా కూల్చివేత‌ల ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించారు. గండిపేట్ మండ‌ల ప‌రిధిలో గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో అడ్డ‌గోలుగా నిర్మాణాల‌ను చేప‌ట్టారు. ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్లు, ఎండోమెంట్‌, పార్కు స్థ‌లాలు, ప్ర‌భుత్వ స్థ‌లాలు, రోడ్లు, చెరువు, నాలాలు క‌బ్జాలు చేప‌ట్టి నిర్మాణాలు చేప‌ట్టేవారు. హైడ్రాను ఏర్పాటు చేసి కూల్చివేత‌లు చేప‌ట్టడంతో ప్ర‌స్తుతం అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్టే వారి గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. హైడ్రా అధికారులు ఎప్పుడు వ‌చ్చి త‌మ నిర్మాణాల‌ను కూల్చివేస్తారోన‌ని కునుకు ప‌ట్ట‌డం లేద‌ని నిర్మాణ‌దారులు ఆందోళ‌న చెందుతున్నారు. వేచి చూడాలి మ‌రి గండిపేట్ మండ‌ల ప‌రిధిలో ఇంకెన్ని అక్ర‌మ నిర్మాణాల‌ను గుర్తించి కూల్చివేస్తారోన‌ని.

Advertisement

Next Story

Most Viewed