మళ్ళీ నెల తర్వాత వస్తా... మార్పు కనిపించాలి : కలెక్టర్ నారాయణరెడ్డి

by Aamani |
మళ్ళీ నెల తర్వాత వస్తా... మార్పు కనిపించాలి : కలెక్టర్ నారాయణరెడ్డి
X

దిశ, శంకర్ పల్లి : శంకర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఆదర్శ పాఠశాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు కుటుంబ ఇంటింటి సర్వే కార్యక్రమం అనంతరం ఆదర్శ పాఠశాలను తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటిసారిగా శంకర్పల్లి ఆదర్శ పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆదర్శ పాఠశాల మొత్తం కలియతిరిగారు. విద్యార్థులు భోజన విరామ సమయంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ పాఠశాలను తనిఖీ చేశారు.విద్యార్థులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్య నివారణ అస్తవ్యస్తంగా ఉండడంపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో, పై అంతస్తులు గల తరగతి గదులను పరిశీలించారు. బాత్రూంలు, మంచినీటి సమస్యపై సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

మండల వనరుల కేంద్రం ( మండల విద్యాధికారి కార్యాలయం) శిథిలావస్థకు చేరి ఉండడం పిచ్చి మొక్కలు మొలవడం అక్కడే మట్టి కుప్పలు పేరుకుపోయి ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల నిర్వహణ నిధులతో పాటు అవసరమైతే రూ.5 లక్షలు మంజూరు చేస్తానని ప్రకటించారు. పాఠశాల చుట్టూ ఆవరణలో పిచ్చి మొక్కలు పూర్తిగా తొలగించి పాఠశాల ఆవరణ పూర్తిగా ప్రైవేటు పాఠశాల క్యాంపస్ మాదిరిగా కనిపించేటట్లు చేయాలని, మళ్లీ నెల తర్వాత వస్తా మార్పు కనిపించాలి లేకపోతే చర్యలు తప్పవు అని హెచ్చరిక చేశారు. ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఆన్ డ్యూటీ లో ఉండడంతో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ సునీత పలు సమస్యలను స్వయంగా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అక్కడే ఉన్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, రెవెన్యూ అధికారి సురేందర్ లు సమన్వయంతో సమస్యలు లేకుండా చేయాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణ ఎలా కనిపించాలనే మోడల్ సైతం తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థికి ప్రణాళిక సైతం బోధించే విధంగా వారికి క్లాస్ తీసుకున్నాడు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ...

ఆదర్శ పాఠశాల తనిఖీ అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆసుపత్రిలోని గదులను పరిశీలించారు. ఆసుపత్రి నిర్వహణ గురించి సమస్యల గురించి స్వయంగా డాక్టర్ తో అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. ప్రతిరోజు ఎంత మంది రక్త పరీక్షలు సేకరిస్తారు? ల్యాబ్ టెక్నీషియన్ రూమ్ లోకి వెళ్లి స్వయంగా ఆసుపత్రి అభివృద్ధి గురించి డాక్టర్ తో మాట్లాడారు. మందుల స్టోర్ రూమును పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో ఎన్ని పడకలు ఉన్నాయి? ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? ప్రతిరోజు రోగులు చూయించుకోవడానికి ఎంతమంది వస్తారు? అవుట్ పేషెంట్ల వివరాలు పరిశీలించారు. సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఈరోజు ఎంత మంది హాజరయ్యారు? అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు.

సీనియర్ అసిస్టెంట్ గత నెల రోజులుగా గైర్హాజరు కావడం, ఇక్కడ పని చేయాల్సిన వారు కొంతమంది డిప్యూటేషన్ వెళ్లడం తదితర విషయాలపై కలెక్టర్ ఆరా తీశారు. గర్భిణీ స్త్రీల వివరాలు, కాన్పుల వివరాలు తదితర అంశాలపై రిజిస్టర్ను పరిశీలించారు. పలు ప్రశ్నలు అడగడంపై సిబ్బంది నీళ్లు నమిలారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పనితీరు పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని లేనట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వెంట చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ తహసీల్దార్ సురేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed