జల్​పల్లి లో భయం.. భయం… పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బ్యాటరీ కంపెనీలు

by Disha Web Desk 11 |
జల్​పల్లి లో భయం.. భయం… పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బ్యాటరీ కంపెనీలు
X

దిశ, బడంగ్ పేట్​ : మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జల్​ పల్లి మున్సిపాలిటీలోని 17వ వార్డులో బ్యాటరీ పరిశ్రమ నుంచి విషవాయువులు వెలువడుతుండడంతో స్థానిక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత కొన్ని రోజులుగా అర్ధరాత్రి వేళ ఆ పరిశ్రమ నుంచి వెలువడుతున్న ప్రాణాంత వాయువులు పీల్చడం వలన చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారు. అర్థరాత్రి సమయంలో జల్​పల్లిని పొగతో కమ్మేస్తుండడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని వింత పరిస్థితి ఎదురయ్యింది. మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని ఇళ్లలో వేడిమిని భరించలేక జల్​ పల్లి వాసులు రాత్రి పూట బయట పడుకుంటున్నారు.

బయట పడుకున్నప్పుడల్లా అర్థరాత్రి సమయంలో శ్వాస పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుండడాన్ని గుర్తించారు. ఏదో విషవాయువులు రాత్రి వేళలో వెదజిమ్ముతున్నాయని, ఆ ప్రాణాంతక వాయువులు పీల్చలేక చస్తున్నామని స్థానిక ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనావాసాలలో ఇలాంటి విష పూరిత పరిశ్రమలు నడుస్తుండటే జల్​ పల్లి మున్సిపాలిటీ అధికారులు, పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు నిలదీస్తున్నారు?

వివరాలలోకి వెళితే ... మహేశ్వరం నియోజకవర్గంలోని జల్​పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులోని గ్రీన్​ సిటీ కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా బ్యాటరీ పరిశ్రమను గత కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. పాడైన బ్యాటరీలను పరిశ్రమకు తరలిస్తున్నారు. అందులో ప్లాస్టిక్​ వ్యర్థాలను, లుథీనియం, యాసిడ్​లను తీసి వేడి కొలిమిలో వేస్తూ కొత్త బ్యాటరీలను తయారు చేస్తున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా అర్థ రాత్రి నుంచి ఉదయం 5 గంటల వరకు బ్యాటరీ పరిశ్రమను నడుపుతున్నారు. ఆ సమయంలో విషవాయువులు గాలిలో కలుస్తూ సమీప ప్రాంతాల ప్రజలు కనీసం శ్వాస తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రాత్రి పూట వెలువడుతున్న విషవాయువుల కారణంగా తప్పని పరిస్థితుల్లో పీల్చుకోవడం తో స్థానిక ప్రాంతాల ప్రజలు ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు , శ్వాస సంబంధిత వ్యాధుల తో అల్లాడుతున్నారు. పలు మార్లు తీవ్ర అస్వస్థతకు గురై అనునిత్యం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంత జరుగుతున్న స్థానిక కౌన్సిలర్​గాని, జల్​ పల్లి మున్సిపాలిటీ అధికారులు గానీ, సంబంధిత శాఖ​ల అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి అనుమతులు లేకుండా పరిశ్రమలు నడుపుతున్నా ..ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మామూళ్ల మత్తులో కౌన్సిర్లు, అధికారులు?

జల్​ పల్లి మున్సిపాలిటీలో ఏదైన కొత్తగా పరిశ్రమ ఏర్పాటయితే స్థానిక కౌన్సిలర్లకు, జల్​ పల్లి మున్సిపాలిటీ అధికారులకు, పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు అధికారులకు కాసుల పంటగా మారింది. నెల వారి మామూళ్లు వసూలు చేస్తూ మిన్న వేశాలు లెక్కిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణాంతక విష వాయువులు వెద జిల్లుతూ తీవ్ర అస్వస్థతకు గురౌతున్న సంబంధిత కౌన్సిలర్లు, అధికారులు నెలసరి మామూళ్లు తీసుకుంటూ ప్రజల ఆరోగ్యాలు గాలిలో కలిపేస్తున్నారని విమర్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికయినా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రాణాంతక విషవాయువులను వెదజిమ్ముతున్న పరిశ్రమల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని జల్​ పల్లి వాసులు డిమాండ్​ చేస్తున్నారు.

Next Story

Most Viewed