చేవెళ్ల ప్రాంత అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం : సబితా ఇంద్రారెడ్డి

by Disha Web Desk 11 |
చేవెళ్ల ప్రాంత అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం : సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, ప్రతినిధి వికారాబాద్ : చేవెళ్ల ప్రాంతం అభివృద్ధి చెందాలన్న, తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినిపించాలన్నా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ నియోజకవర్గంలోని ధారూర్ మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె కార్యకర్తల సమావేశంలో కూడా మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మాకంటే ప్రజలకే కోరిక ఎక్కువగా ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయమాటలు నమ్మి మోసపోయాం, ఇప్పుడు మోసపోయేదే లేదని ఎక్కడికి వెళ్లిన ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చివాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన సొంత పార్లమెంట్ నియోజకవర్గం అయిన చేవెళ్ల పార్లమెంట్ లో కూడా బిఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు.

చేవెళ్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టీ మాత్రమే

పదేళ్ల కేసీఆర్ పాలనలో కులవృత్తులను ఆదుకోవడమే కాక, ప్రతి రైతుకు రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 24 గంటల నాణ్యమైన కరెంటు ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న ఈ 5 నెలల్లో తెలంగాణాలో పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు అర్ధం అయ్యింది. రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతామని ఒకమంత్రి అంటుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తాను సీఎం అనే విషయం మరిచి పేగులు మెడలో వేసుకొని తిరుగుతా అంటాడు.

అందుకే నేడు కేసీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టిన లక్షల మంది ప్రజలు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు కేసీఆర్ అంటే భయం, ఓటమి భయంతో 48 గంటలు ఆయన మాట్లాడవద్దని నిషేదించారు. కేసీఆర్ మాట్లాడకపోయినా బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఒక కేసీఆర్ లా ఎన్నికల్లో కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.

బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు అడిగే హక్కులేదు

చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశర్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ఇద్దరికీ ఈ ఎన్నికల్లో ఓటు అడిగే నైతికత లేదని సబితా ఇంద్రారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరిని ఎంపిలను చేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. కానీ ఇప్పుడు అధికారం మోజుతో ఇతర పార్టీలోకి వెళ్లారు. అదే బిఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఈ ప్రాంతంతో, ఈ ప్రాంత ప్రజలతో మమేకమై 5 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ గా, 5 ఏళ్ళు ఎమ్మెల్సీగా పనిచేసిన రాజకీయ అనుభవం ఉంది. ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి అవుతుంది అన్నారు.

నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా ఇంటి మీద వాలితే తుపాకీతో కాల్చి పడేస్తాం అన్నాడు. మరి మీ పక్కలో ఉన్న రంజిత్ రెడ్డి ఏ ఇంటివాడు..? ఎక్కడి నుంచి తీసుకువచ్చి పోటీ చేయిస్తున్నారు...? దయచేసి ప్రజలు గమనించాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు, ఆయన కూతురు అన్యాయంగా అరెస్ట్ అవుతున్న సందర్భంగా పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి. మానవత్వం లేకుండా పార్టీలో టికెట్ అనౌన్స్ మెంట్ చేసిన తర్వాత ఎందుకు వెళ్లారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు కూడా ఎంపీలుగా ఉన్న సమయంలో పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదు. మీరు ఇద్దరు ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని అన్నారు. ఏ పార్టీ రూలింగ్ లో ఉంటే ఆ పార్టీకి వెళ్తారా..? చేవెళ్ల ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే కమిట్మెంట్ ఉండాలి. ఈ ప్రాంతాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసింది, సంక్షేమ పథకాలు అందించింది బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధి కోసం పార్లమెంట్ లో కొట్లాడతానని అన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆనంద్, ధారూర్ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed