తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి ‘సరస్వతీ పుష్కరాలు’.. ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు

by Gantepaka Srikanth |
తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి ‘సరస్వతీ పుష్కరాలు’.. ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalpally) జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రం(Kaleshwaram Temple)లో ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న సరస్వతీ నది పుష్కరాల ఏర్పాట్ల కోసం అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా(Minister Konda Surekha) సురేఖ ఆదేశాల మేరకు దేవాదాయశాఖ రూ.25 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ సోమవారం ఉత్వర్వులిచ్చారు. సరస్వతీ నది పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే పరిస్థితుల నేపథ్యంలో భక్తులకు మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు, స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం తదితర పనులను పకడ్బందీగా చేపట్టాలని మంత్రి సురేఖ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్‌లను ఆదేశించారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనులు చేపట్టి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి సురేఖ సూచించారు. రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం 2013లో వచ్చిన సరస్వతీ నది పుష్కరాలను కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహించిన విషయాన్ని మంత్రి సురేఖ(Minister Konda Surekha) గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో గతంలో కంటే మిన్నగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా, అత్యంత వైభవోపేతంగా సరస్వతీ నది పుష్కరాలను నిర్వహిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. కాగా, సరస్వతీ పుష్కరం అనేది సరస్వతి నదికి జరిగే పండుగ. ఇది సాధారణంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.

సరస్వతి నదిని త్రివేణి సంగమం(Triveni Sangamam) వద్ద ప్రవహించే "అంతర్వాహిని" (అదృశ్య నది)గా పరిగణిస్తారు. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశి ( మిథునరాశి )లోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు ఆచరిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన పుష్కరాలు తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పాటు అయ్యాక.. మళ్లీ కాంగ్రెస్ హయాంలోనే రావడం ఆసక్తిగా మారింది. అందుకే ఘనంగా నిర్వహించాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ పుష్కరాలకు కాళేశ్వరం ఆలయ ముఖ్య అర్చకులు ముహూర్తాన్ని నిర్ణయించి అందుకు సంబంధించిన లేఖను ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం. 2025 మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరకాలం ప్రారంభమవుతుందని, మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్యస్నానాలు ఆచరించాల్సి ఉంటుందన్నారు. మే 15 నుంచి 26 వరకు పుష్కర కాలం ఉంటుందని వివరించారు. పుష్కరాల నిర్వహణ తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించారు.

Next Story

Most Viewed