ఐదుగురు చేతికే ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం.. నిర్ధారించుకున్న సిట్

by Sathputhe Rajesh |
ఐదుగురు చేతికే ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం.. నిర్ధారించుకున్న సిట్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం కేసులో ‘దిశ’ చెప్పిందే నిజమైంది. ఈ ప్రశ్నపత్రం నలుగురు బోర్డు ఉద్యోగులతో పాటు రాజశేఖర్​రెడ్డి బావ ప్రశాంత్​రెడ్డికి మాత్రమే అందినట్టు సిట్ అధికారుల విచారణలో నిర్ధారణ అయ్యింది. ఏఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ పరీక్షల ప్రశ్నపత్రాలు కేవలం 12 మందికే చేరినట్టు తేలింది.

ఇక, కోర్టు కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో బుధవారం ఉదయం సిట్ అధికారులు ఈ కేసులో అరెస్టయిన షమీమ్, రమేశ్, సురేశ్‌లను చెంచల్‌గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపించిన అనంతరం సిట్ కార్యాలయానికి తరలించారు. పరీక్షలో వందకు పైగా మార్కులు సాధించిన పలువురు అభ్యర్థులను సిట్ కార్యాలయానికి పిలిపించి విచారించారు.

మాకు తెలిసింది...

టీఎస్పీఎస్సీ బోర్డులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ నెట్‌వర్క్ అడ్మిన్‌గా ఉద్యోగం చేస్తున్న రాజశేఖర్​రెడ్డి సహాయంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని తస్కరించిన విషయం వెంటనే తెలిసిందని ఈ కేసులో అరెస్టయిన బోర్డు ఉద్యోగులు షమీమ్, రమేశ్​బుధవారం జరిపిన విచారణలో వెల్లడించినట్టు తెలిసింది.

ఈ విషయాన్ని తాము ప్రవీణ్‌కు చెప్పి పైఅధికారులతో చెప్తామన్నామని అన్నట్టు సమాచారం. దాంతో భయపడ్డ ప్రవీణ్, రాజశేఖర్​రెడ్డి మీరు కూడా పరీక్ష రాసుకోండి అని ప్రశ్నపత్రాన్ని ఇచ్చారని చెప్పినట్టు తెలిసింది. అందుకే మా నుంచి వాళ్లు ఒక్క రూపాయి తీసుకోలేదని వివరించినట్టు సమాచారం. స్నేహం ఉన్న నేపథ్యంలో సురేశ్‌కు ప్రశ్నపత్రాన్ని తాను ఇచ్చినట్టు రమేశ్ వెల్లడించాడని సమాచారం.

అభ్యర్థుల విచారణ

ఇక, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో వందకు పైగా మార్కులు సాధించిన కొంతమంది అభ్యర్థులను అధికారులు సిట్ కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు. వీరికి ప్రొఫార్మా ఇచ్చిన సిట్ అధికారులు వారి విద్యార్హతలు ఏమిటి? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఇంతకు ముందు ఏవైనా పరీక్షలు రాశారా? రాస్తే ఎన్ని మార్కులు వచ్చాయి? అన్న వివరాలను సేకరించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగి రికార్డు చేసుకున్నారని ఖమ్మం నుంచి వచ్చిన స్టాలిన్ అనే అభ్యర్థి చెప్పాడు. ఆ తరువాత విచారణ చేసినట్టుగా ఓ కాగితం ఇచ్చారని, అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పారన్నాడు. ఇప్పటి వరకు 80 మందికిపైగా అభ్యర్థులను విచారించిన సిట్ అధికారులు వీరి చేతికి గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం అందలేదని నిర్ధారించుకున్నట్టు సమాచారం.

కస్టడీకి ఇవ్వండి

ఇదే కేసులో తాజాగా అరెస్టు చేసిన రాజేందర్, ప్రశాంత్, తిరుపతయ్యలను వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని బుధవారం సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై విచారణను కోర్టు వాయిదా వేసింది. కాగా, తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ రేణుక, లద్యావత్​ డాక్యాతోపాటు మరో ఇద్దరు నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.

Advertisement

Next Story