Praneeth Hanumanth: జైలులో ఉన్న యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ పై మరో కేసు!

by Ramesh Goud |
Praneeth Hanumanth: జైలులో ఉన్న యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ పై మరో కేసు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తండ్రికూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ పై మరో కేసు నమోదు అయ్యింది. అతనిపై పోలీసులు మాదక ద్రవ్యాల కేసు నమోదు చేశారు. తండ్రి కూతుళ్ల బంధంపై డార్క్ కామెడీ ముసుగులో సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ హనుమంత్ ను ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అతని పై పోలీసులు మరో కేసును కూడా నమోదు చేశారు. ప్రణీత్ గతంలో మత్తు పదార్ధాలు సేవించినట్లు గుర్తించిన పోలీసులు.. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో అతడు గంజాయి సేవించినట్లు వెల్లడి కావడంతో మత్తు పదార్ధాల కేసు కూడా నమోదు చేశారు.

ఇప్పటికే అతనిపై 67డి, ఐటీ యాక్ట్, ఫోక్సో యాక్ట్, 79, 294 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు కాగా.. దానికి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పలు సెక్షన్లు జత చేశారు. ప్రస్తుతం అతడు చంచల్ గూడ జైలులో ఉన్నాడు. దీనిపై విచారణ నిమిత్తం ప్రణీత్ హనుమంత్ ను మూడు రోజుల పాటు కస్టడీకి కోరుతూ సైబర్ సెక్యూరిటీ పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో రోస్టింగ్ పేరుతో ఫేమస్ అయిన యూట్యూబర్ ప్రణీత్ డార్క్ కామెడీ ముసుగులో చిన్నపిల్లలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. దీనిని స్టార్ హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం సహా పలువురు ప్రముఖుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సైబర్ క్రైం పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story