ఈదురుగాలులతో విద్యుత్ అంతరాయం! కేటీఆర్‌ ట్వీట్‌పై TGSPDCL క్లారిటీ

by Ramesh N |
ఈదురుగాలులతో విద్యుత్ అంతరాయం! కేటీఆర్‌ ట్వీట్‌పై TGSPDCL క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉప్పల్ పరిధిలో పవర్ కట్ కారణంగా సబ్ స్టేషన్ వద్ద స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి కరెంటు కోతలు లేవని, 24 గంటలు నిరంతరాయంగా, విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నారని, కానీ ఇంతమంది సబ్ స్టేషన్ వద్ద ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఈ ట్వీట్‌పై టీజీఎస్‌పీడీసీఎల్ స్పందించింది.

బోడుప్పల్ సబ్ స్టేషన్ సాయి భవాని కాలనీకి సమీపంలో ఉంది. సాయంత్రం 5:20 గంటలకు బోడుప్పల్ సబ్‌స్టేషన్ నుంచి వెలువడే ఉదయ్ నగర్ 11 కేవీ ఫీడర్ నుంచి అందించే (5) ప్రదేశాల్లో చెట్టు-కొమ్మలు పడిపోవడంతో ట్రిప్ అయిందని తెలిపింది. 8:10 గంటలకు విద్యుత్ సరఫరా అందించినట్లు తెలిపారు. 9:15 గంటలకు ఉరుములతో కూడిన వర్షం కారణంగా, ఇన్‌కమింగ్ 33 కేవీ లైన్‌లో ఇన్సులేటర్ వైఫల్యం కారణంగా ఇన్‌కమింగ్ సరఫరా నిలిచిపోయిందని వెల్లడించింది.

9:25 గంటలకు 33 కేవీ బండ్లగూడ నుంచి ఉప్పల్ ఫీడర్ వరకు సబ్‌స్టేషన్‌కు ప్రత్యామ్నాయ సరఫరా ఇచ్చినట్లు పేర్కొంది. 9:40గంటలకు జంపర్ కట్ కారణంగా బండ్లగూడ నుంచి ఉప్పల్ ఫీడర్‌కు ఇన్‌కమింగ్ 33కేవీలో సింగిల్ ఫేజ్ విద్యుత్ అంతరాయం ఏర్పడిందని తెలిపింది. రాత్రి 10:25 గంటలకు బోడుప్పల్ సబ్‌స్టేషన్ పరిధిలోని మొత్తం ప్రాంతానికి 3 ఫేజ్ విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే అనేక అంతరాయాల కారణంగా, సాయిభవానీ కాలనీ వాసులు సబ్‌స్టేషన్‌ను సందర్శించారని స్పష్టంచేసింది.

Advertisement

Next Story