- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డబ్బులిస్తేనే ధ్రువీకరణ పత్రాలు.. పోలీస్ క్వాలిఫైడ్ అభ్యర్థుల తిప్పలు
దిశ, తెలంగాణ బ్యూరో: మొన్నటి వరకు పరీక్షలు, ఈవెంట్స్ అంటూ కుస్తీ పట్టిన పొలీస్ క్వాలిఫైడ్ అభ్యర్థులకు మరో సమస్య వచ్చిపడింది. కష్టపడి చదివి క్వాలిఫై అయిన సంతోషం కొంచెం కూడా లేకుండా చేస్తోంది. క్వాలిఫై అవ్వడం వరకు ఒక ఎత్తయితే.. కొలువులో చేరేందుకు చివరి దశ అయిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ మరో ఎత్తుగా మారింది. సర్టిఫికెట్ల కోసం నానా తిప్పలు పడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు డబ్బులిస్తే కానీ సర్టిఫికెట్లు ఇచ్చేదిలేదని తెగేసి చెబుతున్నాయి. దీంతో క్వాలిఫై అయిన అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. ఇంత వరకు వచ్చాక ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందేనా అని డైలమాలో పడ్డారు. కొందరూ చేసేదేమి లేక తెలిసిన వారి దగ్గర అప్పులు చేసీ మరీ డబ్బులు కట్టడానికి సిద్దమయ్యారు. మరి కొందరు కాలేజీల యాజమాన్యాలను వేడుకుంటున్నారు.
పోలీసు నియామకాల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ రేపటి నుంచి జరుగుతుండడంతో ఈ అభ్యర్థులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడ్డారు. ముఖ్యంగా కానిస్టేబుల్ క్వాలిఫై అభ్యర్థులు డిగ్రీ, ఫార్మసీ, బీటెక్ చేస్తున్నారు. ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు అని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఎస్సై క్వాలిఫై అభ్యర్థుల సమస్య మరో విధంగా ఉన్నది. వారివి డిగ్రీలు అయిపోయాయి. వారు కాలేజీల్లో చెల్లించాల్సిన పెండింగ్ ఫీజులు అలాగే ఉండటంతో సర్టిఫికెట్లు అభ్యర్థులకు ఇవ్వడం లేదు. నియామకాల్లో వెరిఫికేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి తర్వాత వాటిని కాలేజీకి అప్పగిస్తామని అభ్యర్థులు యాజమాన్యాలను వేడుకుంటున్నారు. అయిన కూడా యాజమాన్యాలు విద్యార్థుల విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా నివాస ధృవీకరణ పత్రం కోసం సైతం రెవెన్యూ అధికారులు పోలీస్ క్వాలిఫై అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. దరఖాస్తులు అందించడంలో జాప్యం చేస్తున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ దగ్గర పడుతుండడంతో సమయానికి వివిధ జిల్లాల్లోని రెవెన్యూ అధికారులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అభ్యర్థులు వారి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రేపటి నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన
పోలీస్ నియామక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 14 నుంచి 26 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 18 సెంటర్లలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ వెరిఫికేషన్‌కు రాష్ట్రవ్యాప్తంగా 1,09,906 మంది అర్హత సాధించారు. ఒక్కొక్క జిల్లాలో అభ్యర్థులను బట్టి రోజుకు 600 నుంచి 800 వరకు ధ్రువీకరణ పత్రాలు పరిశీలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులకు నిర్దేశించిన తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి పరిశీలన ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. వెరిఫికేషన్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
అభ్యర్థులు తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్లు
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేంద్రంలోనే అప్లికేషన్ ఎడిటింగ్/మాడిఫై చేసుకునే అభ్యర్థులకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా మార్కుల వెయిటేజీ పొందాలనుకుంటున్న అభ్యర్థులు ఆర్టీఏ ధ్రువీకరించిన సర్టిఫికెట్లను చూపించాలి. వెరిఫికేషన్‌కు వచ్చే అభ్యర్థులు కుల ధ్రువీకరణ, బీసీ అభ్యర్థులు నాన్ క్రీమిలేయర్, ఈడబ్ల్యూఎస్, ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్లు ఒరిజినల్స్, జిరాక్స్‌ల సెట్ తప్పనిసరిగా తీసుకొనిరావాలని అధికారులు తెలిపారు. వీటితోపాటుగా ఇంటిమేషన్ లెటర్, ట్రాన్సాక్షన్ ఫాం, పార్ట్-2 అప్లికేషన్ ప్రింట్ అవుట్, ఆధార్‌కార్డు, స్టడీ సర్టిఫికెట్లు, వయసు, లోకల్, రిజర్వేషన్, ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికెట్లు, ఫోటోలు, మెమోలు, డ్రైవింగ్ లైసెన్స్, హారిజంటల్ రిజర్వేషన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.
యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి: వీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్
‘‘రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలలో ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి అర్హత సాధించి చివరి ఘట్టమైన ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో పోలీస్ క్వాలిఫై అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం అభ్యర్థులు తాము చదువుకున్న కాలేజీల చుట్టూ సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్నారు. కాలేజీ యాజమాన్యలు అభ్యర్థుల సర్టిఫికేట్లు ఇవ్వాలంటే ఫీజులు చెల్లించాలని వేధిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 1,09,906 మంది అర్హులు అయిన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీల్లో సర్టిఫికట్స్ ఇవ్వడం లేదని అభ్యర్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్న తీరు చూస్తు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. డబ్బులిస్తేనే ఒరిజినల్ సర్టీఫికేట్స్ ఇస్తామంటున్న యాజమాన్యాల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’
సర్టిఫికెట్లు ఇవ్వడంలో జాప్యం: రైతు రాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంబి బాలక్రిష్ణ
మండుటెండల్లో పిల్లల కుల, ఆదాయ, స్థానిక ధ్రువ పత్రాల కొరకు రెవెన్యూ కార్యాలయాలలో పిల్లలు ఉదయం పది గంటల నుంచి బారులు తీరి అధికారుల కొరకు ఎదురు చూసినా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా రాకుంటే ఎలాగా..? 3, 4, రోజులైనా సర్టిఫికెట్లు పరిశీలన చేసి ఇవ్వడం లేదు. మీసేవ లో మరో ఇబ్బంది. మరో దిక్కు పోలీసుల నియామకం వారికి సంబంధించిన ధ్రువపత్రాలు ఇవ్వాలి. అధికారులు ఎమ్మార్వో లు వారి కింది స్థాయి ఉద్యోగులు ఏం చేస్తున్నట్లు? వారిని ఎవరు అడగాలి? ఈ విషయంపై కలెక్టర్లు స్పందించక పోతే రక రకాల గొడవలు జరుగుతాయి. వీరికి మూమెంట్ రిజిస్టర్ లేదా ఎవరు రోజుకు ఎన్ని ఫైల్స్ డిస్పోజ్ చేశారని అడిగేవారు లేరా? అధికారులు ఆఫీస్లలో ఉండి కూడా పని చేయక పోతే ఎవరిది పొరపాటు? పని చేయక పోతే అడిగే హక్కు అధికారం ప్రజలకు ఉంది సిబ్బంది పని చేయకపోతే చర్య తీసుకునే అధికారం కలెక్టర్లకు ఉంది, తాత్కాలిక అదనపు సిబ్బందినైనా ఏర్పాట్లు చేసి ఆ కొరత, పబ్లిక్ అవసరాలు తీర్చే ఏర్పాటు చేయాలి