ప్రాణాలను తోడేస్తున్న పేకాట.. అప్పులు తీర్చలేక యువకుడి సూసైడ్

by Sathputhe Rajesh |
ప్రాణాలను తోడేస్తున్న పేకాట.. అప్పులు తీర్చలేక యువకుడి సూసైడ్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఒకటైన రుద్రూర్ మండల కేంద్రంలో జోరుగా పేకాట కొనసాగుతోంది. మిర్చి గ్యాంగ్‌కు సంబంధించిన త్రిమూర్తుల ఆధ్వర్యంలో పగలు, రాత్రి తేడా లేకుండా పత్తాలాట ఆడేస్తున్నారు. పగటి వేళ శివారు ప్రాంతాల్లోకి తీసుకెళ్లి పేకాట ఆడించి కేటి ద్వారా లక్షలకు లక్షలు వసూల్ చేస్తున్నారు. అంతేకాకుండా పత్తాలాడే వారి కోసం పది రూపాయల వడ్డి మొదలుకుని రోజుల ప్రకారం వడ్డీ వసూల్ చేసే మిర్చి గ్యాంగ్ వేధింపులకు రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పేకాట కోసం దందాను పక్కన పెట్టి ఆడిన యువకుడు రూ.10 లక్షల వరకు పత్తాలాడి పొగొట్టుకుని మరో రూ.10 లక్షలు అప్పుల పాలయ్యాడు. దానిని భరించలేక పురుగుల మందు తాగాడు. కాగా హైదరాబాద్‌లో పక్షం రోజుల ట్రిట్‌మెంట్ నడుస్తుండగా ప్రాణాలను కోల్పోయాడు. మిర్చి గ్యాంగ్ పత్తాలాటతో పాటు నిర్వహిస్తున్న జీరో వడ్డీ ప్రాణాలను తోడేస్తుందని చెప్పాలి. పదుల సంఖ్యలో అప్పులు ఇచ్చి వారిని నిత్యం వేధింపులకు గురి చేస్తారని ఆరోపణలున్నాయి. ఉద్యోగాలు, దందాలు నిర్వహించే వారు వారి వద్ద అప్పులు తీసుకుని వడ్డీలు కట్టలేక బంగారం, వాహనాలను తాకట్టుపెట్టి పొగొట్టుకుంటున్నారు.

మండల కేంద్రానికి చెందిన మెడికల్ రిప్‌గా పని చేసిన యువకుడు సైతం రూ.10 లక్షలు పొగొట్టుకున్నాడు. ఇటీవల మిర్చిగ్యాంగ్ వేధింపులతో ప్రాణాలు పొగొట్టుకున్న యువకుడి తాలుకు బంధువులు గ్యాంగ్‌పై దాడికి యత్నించి విఫలమయ్యారు. లోకల్ పోలీసులకు వేల రూపాయల మామూళ్లు ఇస్తున్నామని చెప్పే గ్యాంగ్ దౌర్జన్యం అంతా ఇంతా కాదు. పగలు శివారు ప్రాంతాల్లో, రాత్రి వేళ చార్జింగ్ లైట్ల వెలుగులో పత్తాలాటలు మూడు ముక్కలు, ఆరు షోలుగా నిర్వహిస్తున్నారు. సంబంధిత గ్యాంగ్ నస్రుల్లాబాద్ అటవీ ప్రాంతంలో పేకాట నిర్వహించి అక్కడ పోలీసులు కేసులు నమోదు చేయగానే మకాంను రుద్రూర్‌కు మార్చి ఇక్కడ యువతను పేకాట రాయుళ్లను ఆసరాగా చేసుకుని పత్తాలాట దందాను నిర్వహిస్తున్నారు. పత్తాలాట మూడు ముక్కలు ఆరు షోలుగా నిరంతరం జరుగుతున్నా పట్టించుకునే నాథులు కరువయ్యారు.

Advertisement

Next Story