త్రాగునీరు సరఫరా చేయమంటే పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యపు సమాధానం..

by Indraja |
త్రాగునీరు సరఫరా చేయమంటే పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యపు సమాధానం..
X

దిశ : నాగిరెడ్డిపేట్ : నాలుగు రోజులుగా త్రాగునీరు సరఫరా కావడం లేదని, త్రాగునీరు సరఫరా చేయాలని పంచాయతీ కార్యదర్శిని అడిగితే పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన నిర్లక్ష్యపు సమాధానంతో కోపోద్రిక్తులైన మహిళలు, కాలనీవాసులు మంచినీళ్ల కోసం రోడ్డెక్కి ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం కామారెడ్డి జిల్లా

నాగిరెడ్డిపేట మండలం గోపాల్ పేట్ గ్రామ పంచాయతీలో చోటుచేసుకుంది. గోపాల్ పేట్ గ్రామపంచాయతీ పరిధిలోని సాయి నగర్ కాలనీలో గత నాలుగు రోజులుగా త్రాగునీరు సరఫరా జరగక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ కాలనీకి త్రాగు నీరు సక్రమంగా సరఫరా చేయాలని గ్రామపంచాయతీ కార్యదర్శి కిష్టయ్యను కాలనీ వాసులు అడిగారు.

ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య నిర్లక్ష్యంగా వ్యవహరించారని,"చెట్లపై ఉండి విస్తారాకులు కాదు నీళ్లు వచ్చేటప్పుడే వస్తాయి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి" అని అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని కానివాసులు పంచాయతీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ కాలనీవాసులు బోధన్ - హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి గంటపాటు రాస్తారోకో నిర్వహించారు.

అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట పంచాయతీ కార్యదర్శికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసి ఎంపీడీవో కార్యాలయంలో సాయి నగర్ కాలనీకి త్రాగునీరు సక్రమంగా సరఫరా చేయాలని, అలాగే పంచాయతీ కార్యదర్శి కిష్టయ్యపై అధికారులు తగిన చర్యలు చేపట్టాలని వినతి పత్రం అందజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాయి నగర్ కాలనీ వాసులకు సక్రమంగా త్రాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు.

Advertisement

Next Story