ఆ పని కోసం ఓయూ ఫోటోలు వాడుతున్నారా? ఇకపై ఆంక్షలు తప్పవు.. ఏం జరిగిదంటే?

by Prasad Jukanti |
ఆ పని కోసం ఓయూ ఫోటోలు వాడుతున్నారా? ఇకపై ఆంక్షలు తప్పవు.. ఏం జరిగిదంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ చరిత్రలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్థానం ఓ ప్రత్యేకమైనది. ఎందరినో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు మరెన్నో కీలకమైన ఉద్యమాలకు పురిటిగడ్డగా మారింది. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఓయూ తన ఆర్ట్స్ కాలేజీ భవనం ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ ట్రేడ్ మార్క్ మంజూరు అయితే అనుమతి లేకుండా ఈ ఐకానిక్ భవనం ఫోటోలను మార్కెంటింగ్, వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి వీలు ఉండదు. సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించే ఉద్దేశంతో ఈ భవనానికి ట్రేడ్ మార్క్ కోసం అప్లై చేసినట్లు తెలిసింది.

కాగా ఓయూ బిల్డింగ్ బెల్జియన్ ఆర్కిటెక్ట్ ఎర్నెస్ట్ జాస్పర్ చే రూపొందించబడింది. 1939లో పూర్తి చేయబడిన ఆర్ట్స్ కాలేజీ భవనం కుతుబ్ షాహీ, మొఘల్, కాకతీయ శైలుల కలయికతో ఉస్మాన్ షాహీ వాస్తుశిల్పానికి ఉదాహరణగా నిలిచింది. అలాగే గొప్ప నిర్మాణ వారసత్వానికి నిదర్శనంగా ఉంది. నల్గొండ నుండి సేకరించిన గ్రానైట్ నుండి రూపొందించబడిన ఈ భవనం యొక్క డిజైన్ చారిత్రక ప్రభావాల కలయికను ప్రతిబింబిస్తుంది. ఈ ప్రాంతం యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. కాగా భారతదేశంలోని ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ 2017లో ట్రేడ్‌మార్క్ నమోదును పొందిన మొదటి భవనం కాగా యూఎస్ లో రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమ్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వంటి భవనాలు ట్రేడ్‌మార్క్ చేయబడ్డాయి.

Advertisement

Next Story