అధికారులకు విద్యాశాఖ మంత్రి కీలక ఆదేశాలు.. విపక్షాలు సీరియస్!

by GSrikanth |
అధికారులకు విద్యాశాఖ మంత్రి కీలక ఆదేశాలు.. విపక్షాలు సీరియస్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరానికి పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు కూడా ఉచితంగా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయమే ఇప్పుడు పలు విమర్శలకు తావిస్తోంది. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యనభ్యసించే విద్యార్థులకు నోట్ బుక్స్, యూనిఫాం పంపిణీకి ఆయా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను కచ్చితంగా హాజరయ్యేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశాలివ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికలే టార్గెట్..

ఇది ఎన్నికల ఏడాది కావడంతో ఏ చిన్న అవకాశాన్ని చేజార్చుకోవద్దని బీఆర్ఎస్ భావిస్తున్నట్లుగా దీన్ని బట్టి అర్థమవుతోంది. రాజకీయాలను పాఠశాలలు, విద్యార్థులకు సైతం ఆపాదించడంపై పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్ గా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ప్రభుత్వ కార్యక్రమమైనా, అధికారిక కార్యక్రమమైనా సరే.. క్రెడిట్ తమకే దక్కేలా ప్రణాళిక చేస్తోంది. వాస్తవానికి గతంలో బడి బాట కార్యక్రమంలో అక్కడక్కడ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఒకరికిద్దరు విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు అందించి ఫొటో పోజులిచ్చి వెళ్లేవారు. అప్పుడు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనే ఎలాంటి ఆదేశాలు లేవు. కానీ ఈ ఏడాది చివర్లో ఎన్నికలున్న నేపథ్యంలో స్వయంగా విద్యాశాఖ మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఇందులో భాగస్వాముల్ని చేయాలని ఆదేశించడం వెనుక భవిష్యత్ ఎన్నికలే టార్గెట్‌గా తెలుస్తోంది.

ఓటర్లకు చేరువయ్యేలా ప్లాన్..

అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టాలని ప్లాన్ చేస్తోంది. కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు చేరువ కావాలనే బీఆర్ఎస్ చూస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం విద్యార్థులకు గతేడాది పాఠ్య పుస్తకాల పంపిణీకి చేసిన ఖర్చును, ఈ ఏడాది చేయబోయే ఖర్చును వివరించి ఓటర్లకు చేరువయ్యే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఏడాది పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలకు కలిపి ప్రభుత్వం రూ. 350 కోట్లను ఖర్చు చేయనుంది. గతంలో పోల్చితే ఈ బడ్జెట్ ఎక్కువకానుంది. భవిష్యత్‌లో ఇలాంటి ఇంకెన్ని కార్యక్రమాలు చూడాల్సి వస్తుందోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story