తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్..!

by Satheesh |   ( Updated:2023-02-25 02:40:44.0  )
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి కావడంతో అదేరోజు సెక్రటేరియెట్, అమరవీరుల స్తూపం, అంబేడ్కర్ విగ్రహాలను ప్రారంభించి సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సభకు పలు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించి వారితో రాష్ట్ర పథకాలపై మాట్లాడించి దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా ప్రణాళిక రూపొందిస్తు్న్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్ల బాధ్యతలను ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలకు అప్పగించారు. జనసమీకరణ, సభ సక్సెస్‌కు కార్యాచరణ సిద్ధమైంది.

ఎన్నికల కోడ్‌తో వాయిదా

ఈ నెల 17న సీఎం కేసీఆర్ బర్త్ డేను పురస్కరించుకొని సెక్రటేరియెట్, అమరవీరుల స్తూపం ప్రారంభించాలని భావించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం చేసినప్పటికీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో వాయిదా పడింది. దీంతో ఎలాగైనా 14న ప్రారంభోత్సవాలు జరిపి రెండులక్షల మందితో సభ నిర్వహించాలని బీఆర్ఎస్ అధిష్టానం టార్గెట్ పెట్టుకున్నది. ఈ మేరకు కేడర్‌కు మార్గనిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

సీఎంలకు ఆహ్వానాలు

సెక్రటేరియేట్ ప్రారంభోత్సవానికి బెంగాల్, బీహార్, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌కు సైతం ఆహ్వానం పంపనున్నట్లు సమాచారం. ఒకే వేదికపై నలుగురైదుగురు సీఎంలు కూర్చుంటే దేశ వ్యాప్తంగా చర్చ జరగడంతో పాటు కేసీఆర్ పనితనం దేశ ప్రజలకు తెలిసేలా సభను ప్లాన్ చేస్తున్నారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహంపై సైతం దేశవ్యాప్త ప్రచారం చేయనున్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story