Nominations: ఆ ఎమ్మెల్సీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ..

by Shiva |   ( Updated:2025-03-03 03:21:50.0  )
Nominations: ఆ ఎమ్మెల్సీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ..
X

దిశ, తెలంగాణ బ్యూరో: పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నేడు కౌంటింగ్ జరగనుండగా.. అదే రోజు ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచి పదో తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 11న పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు ఇచ్చారు. 20 వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ జరపనున్నారు. ఈనెల 24 వతేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. కాగా, ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, యెగ్గె మల్లేశం, మిర్జా రియజుల్ హుస్సేన్ పదవీ కాలం ఈనెల 29తో ముగియనుంది. వీరి స్థానంలో కొత్తవారిని భర్తీ చేసేందుకు శానససభ్యులు తమ ఓటు ద్వారా ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉన్నది.

ఇప్పటి వరకు ఖరారు కానీ అభ్యర్ధులు

ఐదు ఎమ్మెల్సీ సీట్లకు అధికారం కాంగ్రెస్ నుంచి చాలా మంది ఆశావాహులు క్యూ కట్టారు. సామాజిక సమీకరణాల వారీగా అవకాశం ఇవ్వాలని పార్టీలో డిమాండ్ పెరిగింది. గతంలో ఎమ్మెల్యేలుగా అవకాశం లభించని వారంతా తమకే ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఒక ఎమ్మెల్సీకి 21 ఓట్లు అవసరం. అధికార కాంగ్రెస్ కే ఎమ్మెల్యే లు ఎక్కువగా ఉండడంతో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునే అవకాశముంది. అదే విధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ గత ఎన్నికల్లో 39 సీట్లు గెలువగా, ఒక సీటుకు ఉప ఎన్నికలు జరగడంతో 38 సీట్లు ఉన్నాయి. అందులో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ప్రస్తుతం ఆపార్టీ బలం 28 మాత్రమే. దీంతో ఒక ఎమ్మెల్సీ స్థానం మాత్రమే గెలుచుకునే అవకాశముంది. అందులో కూడా పోటీ తీవ్రంగా ఉండటంతో ఎవరికి ఇవ్వాలనే అంశంపై బీఆర్ఎస్ పెద్దలు కుస్తీ పడుతున్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో అభ్యర్థులు తేలవచ్చని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా మజ్లిస్ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు, బీజేపీకి 8 మంది ఉండగా, వీరు సొంతంగా పోటీ చేసే అవకాశం లేదు. ఎవరికి మద్దతు ఇస్తారో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed