Rahul Gandhi: ఎన్నికల వ్యవస్థపై రాహుల్ వ్యాఖ్యలు.. మండిపడ్డ బీజేపీ

by Shamantha N |
Rahul Gandhi: ఎన్నికల వ్యవస్థపై రాహుల్ వ్యాఖ్యలు.. మండిపడ్డ బీజేపీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ(BJP) మండిపడింది. ఆయన భారతీయ ఓటర్ల నమ్మకాన్ని పొందలేకపోయారని విమర్శలు చేసింది. విదేశాల్లో భారత్ పరువుని రాహుల్ పదేపదే ఎందుకు తీస్తారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్‌ బండారి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ప్రజాస్వామ్యానికి, భారతదేశానికి వ్యతిరేకి అయిన రాహుల్‌ గాంధీ దేశీయ ఓటర్ల నమ్మకాన్ని గెలుచుకోలేకపోయారు. ఇప్పుడు విదేశీ గడ్డపై మన దేశ ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రశ్నించడం ప్రారంభించారు’ అని బండారి విమర్శించారు. భారత్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న జార్జ్ సోరోస్ ఏజెంట్ రాహుల్ గాంధీ అసలైన ఉద్దేశం ఇదే అని మండిపడ్డారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహబాజ్‌ పూనావల్లా కూడా రాహుల్‌పై విరుచుకుపడ్డారు. అమెరికాలో భారత రాజ్యాంగం, ఎన్నికల కమిషన్, న్యాయస్థానాలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు.

రాహుల్ ఏమన్నారంటే?

“ఎన్నికల వ్యవస్థ రాజీ పడింది.. అందులో పలు లోపాలున్నాయి” అని లోక్ సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ బోస్టన్‌లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగానే ఎన్నికల వ్యవస్థలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల సంఘం (Election Commission) రాజీ పడింది. ఆ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని మాకు స్పష్టంగా తెలుసు. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇటీవల మహారాష్ట్ర (Maharashtra)లో ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 గంటల మధ్య అక్కడ 65 లక్షల మంది ఓటు వేశారు. ఈ విషయం స్వయంగా ఎన్నికల సంఘమే మాతో పేర్కొంది. ఇది భౌతికంగా అసాధ్యమైనది. ఒక్కో ఓటర్‌ ఓటు వేయడానికి సుమారు 3 నిమిషాలు పడుతుంది. అంత తక్కువ వ్యవధిలో అంతమంది ఎలా ఓటు వేస్తారు. మేము వీడియోలు చూపించాలని అడిగితే ఈసీ తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగటానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు’ అని రాహుల్ ఆరోపించారు. అంతేకాకుండా అమెరికా- భారత్‌ సంబంధాలను గురించి కూడా రాహుల్ మాట్లాడారు. ఇరుదేశాలు కలిసి పనిచేయాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed