ఎక్కడి సమస్యలు అక్కడే.. పడకేసిన స్పెషల్ ఆఫీసర్ల పాలన..!

by Aamani |
ఎక్కడి సమస్యలు అక్కడే.. పడకేసిన స్పెషల్ ఆఫీసర్ల పాలన..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాలు లేక, పట్టించుకునే అధికారులు రాక 14 నెలలుగా ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేసుకున్నాయి. సమస్యలు గుట్టల్లా పేరుకుపోగా, అవస్థలతో ప్రజలు సతమతమవుతున్నారు. పంచాయతీలలో పాలనను పర్యవేక్షించడానికి ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించిన, వారు పేరుకే పరిమితమయ్యారు తప్ప సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించడంలో ఆసక్తి చూపడం లేదని, సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థికంగా ప్రయోజనం కలిగించే పంచాయతీలు ఎక్కడుంటాయో అక్కడ మాత్రం తామున్నామంటూ అధికారులు ప్రత్యక్షమవుతున్నారని, బేరం మాట్లాడుకుని వెళ్లిపోతున్నారని ప్రజలు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా ఏం పట్టనట్టు వ్యవహరించడం ప్రజల్లో అనేక సందేహాలకు తావిస్తోంది.

2023 ఫిబ్రవరి 2న ముగిసిన పాలక వర్గాల గడువు..

రాష్ట్రంలో గ్రామపంచాయతీల పాలకవర్గాలకు పదవీ కాలం 2023 ఫిబ్రవరి 2తో ముగిసింది.అప్పటి నుంచి గ్రామపంచాయతీలన్నీ స్పెషల్ ఆఫీసర్ల పాలన పరిధి లోకి వెళ్లి పోయాయి. గ్రామాల్లో పాలన బాద్యతలు వారికే అప్పగించింది ప్రభుత్వం. ప్రభుత్వం స్పెషలాఫీసర్లకు గురుతర బాధ్యతలు అప్పగించిన ప్పటికీ వారు ఈ బాధ్యతలను తేలిగ్గా తీసుకుంటున్నారు. దీంతో ఆఫీసర్లు పేరుకే ఉన్నారు తప్ప, వారి సేవలు గ్రామాల్లో ప్రజలకు అందడం లేదనే ఫిర్యాదులు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అనుమతులు లేకుండానే ఇళ్ల నిర్మాణాలు..

గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే ఏ కొత్త ఇంటి నిర్మాణమైనా నిబంధనలకు లోబడి గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణం పనులు మొదలు పెట్టకూడదు. కానీ, జిల్లాలోని పలు గ్రామాల్లో జరిగే కొత్త ఇళ్ల నిర్మాణాలు అధికారిక అనుమతులు లేకుండానే జరుగుతున్నాయి. దీన్ని అడ్డుకోవాల్సిన అధికారులు ఇంటి యజమానులతో లాలూచీ పడి బేరాలు మాట్లాడుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణాలు పక్కనున్న వారి స్థలాలను ఆక్రమించి నిర్మించుకుంటున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కాసుల కక్కుర్తిలో వారు కుదుర్చుకునే బేరాల పైనే దృష్టి సారిస్తున్నారని, మురుగు కాలువలు నిండి కాలనీ వాసులు దుర్గంధంతో అవస్థలు పడుతున్నా, నల్లాల్‌లో నీటి సరఫరా ఇబ్బందులేర్పడి దాహార్తితో జనం అల్లాడుతున్నా ఈ సమస్యలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. భీమ్‍గల్ మండలంలోని పలు గ్రామాల్లో కొత్తగా నిర్మాణాలు జరుగుతున్న ఇళ్ల విషయంలో స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా, లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసినా , అక్రమార్కులతో అధికారులు కుమ్మక్కై ఫిర్యాదు చేసిన వారినే బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితులు చెబుతున్నారు.

స్థానిక ఎన్నికల ఊసే కరువైంది..

పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 14 నెలలుగా మీన మేషాలు లెక్కిస్తోంది. ఎప్పటి కప్పుడు ఎన్నికల ప్రస్తావనను ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ కాలం వెల్లదీస్తోందే తప్ప ఎప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామనే విషయాన్ని ప్రభుత్వం ప్రకటించడం లేదు. ఇదివరకు పలువురు రాష్ట్ర మంత్రులు సర్పంచ్ ఎన్నికలపై ఫలానా సమయంలోగా జరుపుతామని, నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎన్నికలు కూడా నిర్వహిస్తామని చెప్పినప్పటికీ మంత్రులు ప్రకటనలు ఆచరణలో పెట్టలేదు. స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వ ఆలోచన ఎలా ఉందో తెలియదు కానీ, ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఈ ప్రక్రియ తాత్కాలికంగా పక్కన పెట్టేందుకు ప్రభుత్వం సాకుగా మలుచుకోవడానికి దేన్నీ వదలడం లేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

గ్రామకార్యదర్శులదే ఇష్టారాజ్యం..

గ్రామపంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యులతో కూడిన పాలకవర్గం లేకపోవడంతో పంచాయతీలో కారోబార్ స్థాయి నుండి గ్రామ కార్యదర్శి, ఈవో లే ఇష్టారాజ్యంగా వ్వవహరిస్తున్నారు. ఇటీవలే కొత్తగా డ్యూటీ లో చేరిన గ్రామ కార్యదర్శులు కూడా అక్రమాలకు ఊతం అందించేలా ఎదిగిపోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గ్రామకార్యదర్శుల ద్వారా మండల స్థాయి అధికారులు ఎంపీఓ, ఎంపీడీఓలు డైరెక్టుగా ఇంటి యజమానులకు మండల కేంద్రంలోని తమ కార్యాలయాలకే పిలిపించుకుని బేరం మాట్లాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధలను తుంగలో తొక్కి ,చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసిన వారిపైనే అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, పలువురు బాధితులు సమస్యను ఇటీవల జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. చాలా ఏళ్లుగా గ్రామాల్లో కారోబార్ లుగా పనిచేస్తున్న కొందరు ముడుపుల వసూళ్లు, బేరాల్లో ఆరితేరిన వారుండటం గమనార్హం. వారితో కలిసి కొందరు కొత్త గ్రామకార్యదర్శులు బేరాలు మాట్లాడుకుని అడ్డదారిలో ఇళ్ల నిర్మాణాలకు పర్మీషన్లు ఇస్తున్నారు. ఈ విషయాలపై ఇప్పటికే భీమ్‍గల్ మండలం లోని పలు గ్రామాల్లో అనేక ఫిర్యాదులున్నాయి. ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరమెంతైనా ఉంది.

Advertisement
Next Story