అధ్వానంగా మారిన ఆశ్రమ కళాశాల నిర్వహణ..

by Sumithra |
అధ్వానంగా మారిన ఆశ్రమ కళాశాల నిర్వహణ..
X

దిశ, భిక్కనూరు : పెరిగిన పిచ్చి మొక్కలు.. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం.. కోతుల స్వైర విహారం, అప్పుడప్పుడు పాముల సంచారం మధ్య విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వసతి గృహంలో నుంచి డైనింగ్ హాల్లోకి లంచ్ బ్రేక్ కోసం పల్లెం పట్టుకొని వెళ్లాలన్న, క్లాసులకు అటెండ్ కావాలన్నా.. కోతులు ఎక్కడ కరుస్తాయో నన్న భయం.. దీనికి తోడు వసతి గృహం సమీపంలో ఉన్న టాయిలెట్లు అధ్వానంగా మారడం, వాటి ద్వారా వస్తున్న కంపును భరించలేక విద్యార్థులు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు సాంఘిక సంక్షేమ ఆశ్రమ కళాశాలలో చేరడానికి మొదట ప్రవేశ పరీక్షకు అటెండ్ కావలసి ఉంటుంది. ప్రవేశ పరీక్ష రాసేందుకు నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులు ప్రవేశ పరీక్షలో ఎక్కువ సంఖ్యలో పాల్గొని సీట్లు దక్కించుకుంటున్నారు.

విద్యాప్రమాణాలు బాగానే ఉన్నా, కనీస వసతులు కూడా వారికి అందడం లేదు. టాయిలెట్లు, బాత్రూంలు, సరిగా లేకపోవడంతో విద్యార్థులు కొందరు ప్రహరీ గోడ దూకి, మరికొందరు కళాశాల మెయిన్ గేటు ద్వారా వన్ కు, టూకు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. వాష్ రూంలు ఉండగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకని "దిశ" విద్యార్థులను ప్రశ్నించగా బాత్రూంలు సరిగా లేవని, టాయిలెట్లకు వెళ్ళరాకుండా అపరిశుభ్రంగా, పైప్ లైన్ లు ధ్వంసం కావడం వలన వాటిలోకి వెళ్ళలేకపోతున్నామని చెబుతున్నారు. సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న ఈ ఆశ్రమ కళాశాలలో విద్యార్థుల సంఖ్య కూడా బాగానే ఉంది. ఉదయం లేవగానే పాఠశాల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇంకొందరు విద్యార్థులైతే సార్ల కళ్ళుగప్పి రాత్రివేళ హైవే దాటి సమీపంలో ఉన్న దాబాలకు వచ్చి కూర్చుంటున్నారు.

అక్కడ గంటా రెండు గంటలు టైంపాస్ చేసి, అక్కడే భోజనం చేసి తిరిగి వసతిగృహాలకు చేరుకుంటున్నారు. స్నానాలు చేయడానికి బాత్రూంలు కూడా సరిగా లేకపోవడంతో, మినీ ట్యాంకు వద్ద ఏర్పాటు చేసిన నల్లాల చుట్టూ స్నానాలు చేసేందుకు విద్యార్థులు క్యూ కట్టక తప్పడం లేదు. వసతిగృహం కిటికీల గ్లాసులు పగిలిపోవడం, కిచెన్, డైనింగ్ రూంలకు కిటికీలు సరిగా లేకపోవడంతో కోతులు చొరబడుతూ పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అపరిశుభ్రత వాతావరణం వలన పాములు సంచరిస్తున్నాయి. అడపదడపా వస్తున్న పాములను సిబ్బంది చంపేస్తున్నారు. మూడు రోజుల క్రితం క్రికెట్ ఆడుతున్న తాడ్వాయి మండలం దేమె గ్రామానికి చెందిన అక్షిత్ పాము కాటు గురై ఆసుపత్రిలో చేరిన విషయం విధితమే.

ఫోన్ లిఫ్ట్ చేయని ప్రిన్సిపాల్...

పాఠశాలలో నెలకొన్న సమస్యల పై ఆదివారం "దిశ " కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డికి ఫోన్ చేసి ఫోన్ చేసి వివరణ కోరె ప్రయత్నం చేయగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు.

Next Story

Most Viewed