గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు 77.69 శాతం అభ్యర్థుల హాజరు

by Sumithra |
గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు 77.69 శాతం అభ్యర్థుల హాజరు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి జిల్లా కేంద్రంలోనే జరిగిన ప్రిలిమ్స్ పరీక్ష ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్ జిల్లాలో 77.69 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. మొత్తం 12,858 మంది అభ్యర్థులకు గాను 9990 మంది పరీక్ష రాయగా, 2868 మంది గైర్హాజరయ్యారని వివరించారు. నిజామాబాద్ లో పరిక్ష కేంద్రాలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా సైతం పరీక్షా కేంద్రాలను సందర్శించారు.

కామారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 ప్రాథమిక పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్కే డిగ్రీ కళాశాల, సందీపని జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రాలలో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు నిర్వహణ ప్రక్రియను చూశారు. జిల్లాలో 9 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 4,549 అభ్యర్థులు ఉండగా వారిలో 3,712 మంది హాజరయ్యారు.837 మంది గైరాజరైనట్లు చెప్పారు. 81.60 శాతం హాజరు నమోదు అయిందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed