మైనారిటీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి

by Shiva |
మైనారిటీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి
X

రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న మైనారిటీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మొహమ్మద్ ఇంతియాజ్ ఇసాక్ అన్నారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీలతో కలిసి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ టెలిఫోన్ కాలనీలో గల బైతుల్ మాల్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యాలయంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 120 మంది యువతులు, బాలికలకు వృత్తి నైపుణ్య శిక్షణను అందించి ఉపాధి కల్పించనున్నారు. బోధన్ రోడ్ లో గల లింక్ కంప్యూటర్స్ సెంటర్లో యువత కోసం ప్రత్యేకంగా నెలకొల్పిన కోర్సులను సైతం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ మాట్లాడుతూ.. సమాజంలో అన్ని వర్గాల వారి కంటే మైనారిటీలు ఎంతో వెనుకంజలో ఉన్నారని, ఈ విషయాన్ని గమనించిన తెలంగాణ ప్రభుత్వం వారిని ప్రగతి దిశగా పయనింపజేయాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.

ముఖ్యంగా విద్యతోనే అభివృద్ధి సాధ్యమని గుర్తించి, మైనారిటీల కోసం విస్తృత స్థాయిలో రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఇది వరకు కేవలం 12 మైనారిటీ రెసిడెన్షియల్ బడులు మాత్రమే ఉండేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రస్తుతం రాష్ట్రంలో వాటి సంఖ్య 204 కు చేరుకుందని తెలిపారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షల చొప్పున ఖర్చు చేస్తూ కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే రీతిలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు.

ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ.. మైనారిటీ యువతకు విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించామని తెలిపారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ మాట్లాడుతూ మైనారిటీలకు వివిధ రంగాలలో తగిన న్యాయం జరిగేలా కమిషన్ కృషి చేస్తుందని అన్నారు.

అంతకుముందు ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నిజామాబాద్ ఆర్డీఓ రవి, మైనారిటీ సంక్షేమ శాఖ ఇంచార్జి అధికారి రమేష్, నిజామాబాద్ ఏ.సీ.పీ కిరణ్ కుమార్ తదితరులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ ఇద్రీస్, కార్పొరేటర్లు షకీల్, ఖుద్దూస్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ జిల్లా జనరల్ మేనేజర్ అబ్దుల్ హమీద్, రెడ్ కో సంస్థ మాజీ చైర్మన్ ఎస్.ఏ.అలీం, హజ్ కమిటీ సభ్యుడు నవీద్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed