భద్రంగా అభ్యర్థుల భవితవ్యం

by Sridhar Babu |
భద్రంగా అభ్యర్థుల భవితవ్యం
X

దిశ, కామారెడ్డి : సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అటు పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికలకు వినియోగించిన ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూములో హై సెక్యూరిటీ మధ్య భద్రపరిచారు. ఈనెల 3న ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా అప్పటివరకు ఫలితాలపై ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు కార్యకర్తలు, నాయకులు ఎవరికి వారుగా అంచనాలు వేసుకుంటున్నారు. అంతేకాకుండా తమ అభ్యర్థి గెలుస్తాడంటే తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటూ జోరుగా బెట్టింగులను సాగిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు ఎక్కడైనా తారసపడితే చాలు గెలుపు ఓటములపైనే చర్చ జరుగుతుంది.

ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని సంస్థలు అధికార బీఆర్ఎస్ పార్టీకి, మరికొన్ని సంస్థలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పేర్కొనడంతో కార్యకర్తలు దీనిపైన చర్చ మొదలు పెట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఈనెల 9న ప్రమాణ స్వీకారం చేపడుతుందని, అప్పటివరకు కార్యకర్తలు సంబరాలు చేసుకోండి అని పేర్కొనడంతో కార్యకర్తలు జోష్ తో ఉన్నారు. తమ పార్టీ గెలుస్తుంది అంటూ బెట్టింగులు కాస్తున్నారు. ఇదిలా ఉండగా అధికార పార్టీ కి చెందిన మంత్రి కేటీఆర్ ఎగ్జిట్ పోల్స్ ను నమ్మవద్దని, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలో చెప్పారని, కానీ వాటి అంచనాలను తారుమారు చేసి పార్టీ గెలవలేదా, తాము అధికారంలోకి రాలేదా అంటూ పేర్కొనడంతో ఆ పార్టీ కార్యకర్తలు జోష్తోనే ఉన్నారు. తాము కూడా తక్కువేం కాదంటూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈసారి రాష్ట్రంలో తమ పార్టీ అధికారం చేపడుతుందని ధీమాలో ఉన్నారు.

బెట్టింగులు షురూ...

కామారెడ్డి నియోజకవర్గం అంటేనే రాష్ట్రవ్యాప్తంగా అందరి నోళ్లలో నానే నియోజకవర్గంగా పేరుంది. ఇక్కడ సీఎం కేసీఆర్ తో పాటు కాబోయే సీఎం అని చెప్పుకునే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేయడమే ఇందుకు కారణం. వీరిద్దరికి దీటుగా బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి బరిలో నిలిచి ఎదురొడ్డడంతో గట్టి పోటీనే నెలకొంది. అయితే ఇద్దరు సీఎం క్యాండిడేట్లు ఓడిపోయి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలుస్తాడని చాలామంది బెట్​ కాస్తున్నారు. మరికొందరు మాత్రం ముగ్గురు అభ్యర్థులపై వేరువేరుగా బెట్టింగులు షురూ చేశారు. ఇదిలా ఉండగా ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం తమ అభ్యర్థులే గెలుస్తారంటూ ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు బెట్టింగులు కాస్తున్నారు.

75 శాతం పోలింగ్ సరళి ఎవరికి అనుకూలమో...

కామారెడ్డి నియోజకవర్గంలో 252,460 మంది ఓటర్లు ఉండగా ఇందులో ఒక లక్ష ఇరవై 1,22,019 మంది పురుషులు, 1,30, 417 మంది మహిళలు, 24 మంది ఇతరులు ఉన్నారు. కాగా 1,90,811 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 1, 00,866 మంది మహిళలు, 89,936 మంది పురుషులు, 9 మంది ఇతరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 75.58 పర్సంటేజీ పోలింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ పోలింగ్ శాతాన్ని బట్టి ఏ పార్టీకి మీ

అభ్యర్థికి అనుకూలంగా ఉంటుందోనని చర్చించుకుంటున్నారు. కామారెడ్డి పట్టణంలో బీజేపీకి అనుకూలంగా ఉంటే ఇదే కామారెడ్డిలో మైనార్టీలు తమ పార్టీకి అనుకూలంగా ఉంటారని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. కాగా గ్రామాల్లో మాత్రం మహిళలు, పింఛన్​దారులు, రైతులు తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారని అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. ఎవరికి వారుగా తమ పార్టీకి అనుకూలంగా పోలింగ్ నమోదయిందని చర్చించుకుంటున్నారు.

మరో రెండు రోజుల్లో వెలువడనున్న అభ్యర్థుల భవితవ్యం

ఈనెల 3న ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో మరో రెండు రోజుల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ప్రస్తుతం అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉండగా మూడున కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

Next Story

Most Viewed