బ్యాంక్ మేనేజర్ ను ఎయిర్ గన్ తో బెదిరించిన సర్పంచ్..

by Sumithra |
బ్యాంక్ మేనేజర్ ను ఎయిర్ గన్ తో బెదిరించిన సర్పంచ్..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టి నాయకుల అగడాలు మితిమిరిపోతున్నాయి. అధికారం ఉంది కదా అని ఫైరవీలు చేయడానికి, బెదిరింపులకు పాల్పడడానికి వెనుకడుగు వేయడం లేదు. ఏకంగా రాష్ర్ట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత మండలం వేల్పూర్ పరిధిలోని ఒక గ్రామంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ ను పోచంపల్లి గ్రామసర్పంచ్ అనంత్ రావు దేశ్ పాండే ఎయిర్ గన్ తో బెదిరించాడు. అధికారం ఉంది కదా అని ఏకంగా బ్యాంక్ లో రుణాలు ఇప్పిస్తాం, రికవరి చేస్తామని దానికి ఒప్పుకోవాలని బ్యాంక్ అధికారులు ఈ వ్యవహరం చూసిచూడనట్లు ఉండాలని కోరగా వారు ససేమీరా అనడంతో ఎయిర్ గన్ తో బెదిరించారు.

గత వారం బ్యాంక్ లో నలుగురు మాత్రమే ఉన్నప్పుడు పోచంపల్లి సర్పంచ్ బ్యాంక్ మేనేజర్ ను గన్ తో బెదిరించిన పంచాయతి ఆదివారం అంక్సాపూర్ వీడీసీ వద్ధకు వచ్చింది. బ్యాంక్ మేనేజర్ ను బెదిరించిన ఘటనలో ప్రత్యక్షంగా చూసిన వారు లేకపోవడం, నేరుగా ఫిర్యాదు చేసే అధికారం లేకపోవడంతో మేనేజర్ ఈ వ్యవహారంను రీజినల్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. బ్యాంక్ లో మరమ్మత్తుల కారణంగా సీసీటీవీ పుటేజీలు కేవలం బ్యాంక్ పరిసరాలలో మాత్రమే ఉన్నట్లు తెలిసింది. బ్యాంక్ మేనేజర్ గదిలో కెమెరా లేకపోవడంతో ఈ తతంగం రికార్డు కాలేదు. ఆదివారం అంక్సాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ వద్ధ మేనేజర్ కుటుంబ సభ్యులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ వ్యవహరం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలకు బ్యాంక్ అధికారులను కూడా వదలడం లేదని రూడి అయింది. మంత్రి ఇలాకాలో జరిగిన ఘటనపై పోలీసులు, బ్యాంక్ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Advertisement

Next Story