ఎమ్మెల్యే సారూ.. పిట్లం మండల సమస్యలు పట్టవా..?

by Aamani |
ఎమ్మెల్యే సారూ.. పిట్లం మండల సమస్యలు పట్టవా..?
X

దిశ,పిట్లం : పిట్లం మండలం లో ఏర్పడుతున్న సమస్యలను పట్టించుకోవడం లేదని పిట్లం మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కారం కోసం జుక్కల్ క్యాంపు కార్యాలయంలో అనేక పర్యాయాలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినప్పటికీ పిట్లం మండల కేంద్రంలో ఏర్పడుతున్న సమస్యలపై ఏ రోజు కూడా ఎమ్మెల్యే, అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించకపోవడం పట్ల పిట్లం మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పిట్లం మండల కేంద్రంలో ప్రధానంగా ఆసుపత్రి ఉన్నప్పటికీ అందులో వైద్యుల కొరత ఉండడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న ఆసుపత్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా మార్చారు అందులో ఆరుగురు వైద్యులు అవసరం ఉండగా ఒక డెంటల్ వైద్యురాలు తప్ప మిగతా వైద్యులు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మిగతా కిందిస్థాయి పారామెడికల్ సిబ్బంది ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల ఓరల్ ఆదేశాల మేరకు ఇక్కడ నుండి వేరే వేరే ఆసుపత్రిలో కొనసాగుతున్నారు.

ఈ సమస్యలన్నిటిని పరిష్కరించాల్సిన అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన ఎమ్మెల్యే అధికారుల నియామకంలో చొరవ చూపకపోవడంతో సమస్యలు ఇంకా తీవ్రతరంగా మారుతున్నాయని మండల ప్రజల ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే పిట్లం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ గ్రామాన పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించడం లో అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహించి సమస్యలను తెలుసుకొని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా అధికారులను అప్రమత్తం చేయాల్సిన ప్రజా నాయకుడు చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు సైతం మండలం లో వినిపిస్తున్నాయి. పిట్లం మండలం లో కొన్ని కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. ఈ కాలనీలలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదన్న విమర్శలు సైతం మండలంలో ఉన్నాయి.

చిన్నపాటి వర్షానికి గ్రామాలలోని రోడ్లన్ని చిత్తడి గా మారుతున్న ఎవరు పట్టించుకోవడంలేదని గ్రామీణ స్థాయి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిట్లం మండల కేంద్రంలో గల వసతి గృహంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అనేక సమస్యలు ఏర్పడుతున్నప్పటికీ ఏ ఒక్క అధికారి సైతం పట్టించుకోవడం లేదు.మండల కేంద్రంలో బాలుర కొరకు ప్రత్యేక వసతి గృహం ఏర్పాటు చేసినప్పటికీ దాని చుట్టూ దుకాణ సముదాయాలు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.దీనిపై గతంలో ఎన్ని పర్యాయాలు అధికారుల దృష్టికి తీసుకుపోవాలన్న సంకల్పంతో పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ ఎవరూ పట్టించుకో లేకపోవడం శోచనీయం.ఇప్పటికైనా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే సమస్యలను పట్టించుకోని పిట్లం మండలం కేంద్రంలోని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యలను నివారించే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed